Sarpatta Movie Review: ఆర్య ‘సార్పట్ట’ మూవీ ఎలా ఉదంటే..

22 Jul, 2021 11:53 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : సార్పట్ట
జానర్ : పీరియాడికల్‌ స్పోర్ట్స్‌ డ్రామా
నటీనటులు : ఆర్య, దుషారా విజయన్‌, పశుపతి, అనుపమ కుమార్‌, జాన్‌ కొక్కెన్‌ తదితరులు
నిర్మాణ సంస్థలు :  నీలం ప్రొడక్షన్స్‌,  కె9 స్టూడియో
నిర్మాతలు : షణ్ముగం దక్షన్‌ రాజ్‌ 
దర్శకత్వం : పా.రంజిత్‌
సంగీతం :  సంతోష్‌ నారాయణ్‌
సినిమాటోగ్రఫీ : మురళి.జి
ఎడిటర్‌ : సెల్వ ఆర్‌.కె
విడుదల తేది : జూలై(22), 2021(అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో)

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో ‘కబాలి’, ‘కాలా’లాంటి చిత్రాలతో క్రేజ్‌ తెచ్చుకున్న యంగ్‌ డైరెక్టర్‌ పా.రంజిత్‌. వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్‌, కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆర్య. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘సార్పట్ట’. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? బాక్సర్‌గా ఆర్య ఎలా నటించాడు? ఈ చిత్రంతోనైనా పా.రంజిత్‌ కమర్షియల్‌ సక్సెస్‌ అందుకున్నాడా? లేదా? రివ్యూలో చూద్దాం. 

కథ
ఈ సినిమా కథ అంతా ఎమర్జెన్సీ కాలం(70వ దశకం)లో నడుస్తుంది. ఉత్తర చెన్నైలోని ఓ  హార్బర్‌లో హమాలి కూలీగా పనిచేసే సమర అలియాస్‌ సామ్రాజ్యం(ఆర్య)కి చిన్నప్పటి నుంచి బాక్సింగ్‌ అంటే చాలా ఇష్టం. స్కూల్‌కి డుమ్మా కొట్టి మరీ బాక్సింగ్‌ పోటీలు చూడడానికి వెళ్లేవాడు. కొడుకు బాక్సింగ్‌ పోటీలకు వెళ్లడం మాత్రం తల్లి భాగ్యం(అనుపమ కుమార్‌)కు అస్సలు నచ్చదు. కానీ సమర మాత్రం తల్లి కళ్లు కప్పి బాక్సింగ్‌ పోటీలను చూసేందుకు వెళ్లేవాడు. కట్‌ చేస్తే.. ఒకరోజు బాక్సింగ్ క్రీడకు మారుపేరైన సర్పట్టా, ఇడియప్ప మధ్య జరిగిన బాక్సింగ్‌ పోటీలో సార్పట్ట ఓడిపోతుంది. దీంతో సార్పట్ట తరపున బాక్సింగ్‌ చేసి గెలుస్తానని సమర ప్రత్యర్థులకు సవాల్‌ విసురుతాడు. తన తల్లి మాటను పక్కన పెట్టి ఇడియప్ప పోటీదారైన వేటపులి(జాన్‌ కొక్కెన్‌)తో పోటీ పడేందుకు సిద్దమవుతాడు. అసలు సమర బాక్సర్‌ అవడానికి అతని తల్లికి ఎందుకు ఇష్టం లేదు? బాక్సింగ్‌ బరిలోకి దిగిన సమరకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి? తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమింగే గురువు రంగా కోసం సమర ఎలాంటి సహసం చేశాడు? బాక్సింగ్‌ పోటీల్లో రారాజుగా వెలుగొందుతున్న వేటపులిని సమరా ఓడించాడా? లేదా? అనేదే మిగతా కథ. 

నటీనటులు
బాక్సర్‌గా ఆర్య అద్భుతంగా నటించాడు. సమర పాత్ర కోసం ఆర్య పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. బాక్సింగ్‌పై ఇష్టం ఉన్న యువకుడిగా, తల్లిమాటని జవదాటని కొడుకుగా తనదైన యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. అలాగే చెడు వ్యసనాలకు బానిసైన వ్యక్తిగాను ఆకట్టుకునే నటనను కనబరిచాడు. ఇక ఆర్య తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర పశుపతిది. గురువు రంగా అలియాస్‌ రంగయ్య పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఈ సినిమాకు ఆయన స్పెషల్‌ ఎట్రాక్షన్‌ అని చెప్పొచ్చు. సమర భార్య పాత్రలో దుషారా విజయన్‌ సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకుంది. వేటపులిగా జాన్‌ కొక్కెయ్‌ అదరగొట్టేశాడు. డాడీ పాత్రలో జాన్‌ విజయ్‌ అలరించాడు. అనుపమ కుమార్‌, షబ్బీర్‌ తదితురలు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

విశ్లేషణ
క్రీడా నేపథ్య చిత్రాలు ఇండియాలో ఇప్పటికే చాలా వచ్చాయి. ఆ కథలన్నింటిని ఒక్కసారి పరిశీలిసే​.. ముందుగా హీరో సాధారణ వ్యక్తిగా ఉంటాడు. అతనిపై ఎవరికి ఎలాంటి అంచానాలు ఉండవు. కానీ ఏదో ఒక సంఘటన వల్ల హీరో ఆ క్రీడా రంగంలోకి సడెన్‌గా ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు అతనిలోని మరో కోణం బయటపడుతుంది. ఒక ప్లాష్‌బ్యాక్‌... లక్ష్యం వెళ్తున్న హీరోకి అడ్డంకులు, చివరకు హీరో విజయం. ఇదే ప్రతి సినిమా నేపథ్యం. ‘సార్పట్ట’కూడా కొంచెం అటు,ఇటుగా అలాంటి కథే. బాక్సింగ్‌కి 70వ దశకం నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను జోడించి చెప్పడం ఈ సినిమా స్పెషల్‌.

అప్పటి బాక్సింగ్‌ సంస్కృతి ఎలా ఉండేదో తెరపై కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు పా.రంజిత్‌. ఇతర విషయాల జోలికి వెళ్లకుండా నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లిపోయాడు. బాక్సింగ్‌ అంటే ఇష్టపడే ఒక యువకుడు తల్లి కోసం ఆ ఆటకు దూరంగా ఉండటం, అనుకోని సంఘటన వల్ల బాక్సర్‌గా మారి, ప్రత్యర్థులు చేసే కుట్రలను తిప్పికొడుతూ గురువుగారి మాట నిలబెట్టటం తదితర సన్నివేశాలను ఆసక్తిగా తీర్చిదిద్దాడు. అయితే క్రీడా నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు ‘భావోద్వేగం’అతి ముఖ్యమైనది. అదే సినిమా జయాపజయాలను నిర్ణయిస్తాయి. సార్పట్టలో ఆ ‘ఎమోషన్‌’మిస్సయింది. ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు కూడా పెద్దగా లేవు. 

సినిమా ఆరంభంలో కాస్త ఆసక్తికరంగానే అనిపించినా... కథలో, పాత్రల్లో ఒక నిలకడ లేకపోవడం ప్రతికూల అంశమే.సెకండాఫ్‌లో సాగదీత సీన్స్‌ సినిమాపై అభిప్రాయాన్ని మారుస్తాయి. అలాగే ఒక్కసారి కూడా బాక్సింగ్‌ కోచింగే తీసుకొని హీరో.. ఉన్నట్లుండి గ్లవ్స్‌ వేసుకొని అత్యుత్తమ బాక్సర్‌ని చితక్కొట్టడం కొంచెం అతిగా అనిపిస్తుంది. అన్నింటికీ మించి తెలుగు ప్రేక్షకులు ఇది మన సినిమా అని ఫీలయ్యే అవకాశం ఎక్కడా లేదు. కానీ ‘కబాలి’,‘కాలా’లాంటి విభిన్న చిత్రాలను అందించిన పా.రంజిత్‌.. ఈ సారి భిన్నంగా స్పోర్ట్స్‌ డ్రామాను ఎంచుకొని, దానికి పీరియాడికల్‌ టచ్‌ ఇచ్చి తీర్చిదిద్దిన విధానం బాగుంది.

ఇక సాంకెతిక విషయానివస్తే.. స్పోర్ట్స్‌ డ్రామా చిత్రంలో  ప్రేక్షకుడిని లీనం చేయడంలో నేపథ్య సంగీతాన్ని కీలక పాత్ర. ఆ విషయంలో సంతోష్‌ నారాయణ్‌ సక్సెస్‌ అయ్యాడు. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. కానీ పాటలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయనే చెప్పాలి. మురళి.జి సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన లోపం సెల్వ ఆర్‌.కె ఎడిటింగ్‌. సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఫస్టాఫ్‌లో ఉన్న జోష్‌.. సెకండాఫ్‌లో ఉంటే ‘సార్పట్ట’ మరోస్థాయిలో ఉండేది. మొత్తంగా స్పోర్ట్స్‌ డ్రామా సినిమాలను ఇష్టపడే వారికి ‘సార్పట్ట’నచ్చుతుంది.


ప్లస్‌ పాయింట్స్‌
ఆర్య, పశుపతి నటన
నేపథ్య సంగీతం
దర్శకత్వం
ఫస్టాప్‌

మైనస్‌ పాయింట్స్‌
సెకండాఫ్‌లోని సాగదీత సీన్స్‌
సినిమా నిడివి
ఊహకందే క్లైమాక్స్‌

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.5/5)
Poll
Loading...
మరిన్ని వార్తలు