-

Satya Dev: 'గుర్తుందా శీతాకాలం కోసం చాలా హోమ్‌ వర్క్‌ చేశాను'

9 Dec, 2022 08:51 IST|Sakshi

‘‘గుర్తుందా శీతాకాలం’ మంచి సినిమా. ఇందులో కాలేజీ సీన్స్‌ ఉన్నాయి. ఈ వయసులో చేయకపోతే తర్వాత చేయలేం కాబట్టి చేశాను. మా సినిమా రిలీజ్‌కు ఈ సీతాకాలం సరైన సమయం అని ఇప్పుడు రిలీజ్‌ చేస్తున్నాం’’ అని సత్యదేవ్‌ అన్నారు. నాగశేఖర్‌ దర్శకత్వంలో సత్యదేవ్‌ హీరోగా, తమన్నా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. చినబాబు, ఎంఎస్‌ రెడ్డి సమర్పణలో చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్‌ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా సత్యదేవ్‌ మాట్లాడుతూ – ‘‘స్కూల్, కాలేజ్, ఆ తర్వాత మిడిల్‌ ఏజ్‌.. ఇలా మూడు షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించే అవకాశం రావడం చాలా అరుదు. కాబట్టి ప్రేక్షకులను ఒప్పించడానికి ‘గుర్తుందా శీతాకాలం’లోని పాత్ర కోసం చాలా హోమ్‌ వర్క్‌ చేశాను. ఇంతకుముందు ఇదే జోనర్‌లో ‘ప్రేమమ్, నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమొరీస్‌’ వచ్చినా మా సినిమాలో కొత్తదనం కనిపిస్తుంది కాబట్టి ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది.

ఈ మధ్య థియేటర్స్‌కు జనాలు రావడం లేదంటున్నారు. కానీ మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలు వస్తే ఆదరిస్తారు. ‘సీతారామం, కాంతార, లవ్‌ టుడే’ చిత్రాలు బాగుండటంతో మౌత్‌ టాక్‌ ద్వారా సూపర్‌హిట్‌ అయ్యాయి. ప్రస్తుతం ‘కృష్ణమ్మ, ఫుల్‌ బాటిల్‌’తో పాటు తమిళ్‌–కన్నడ భాషల్లో రూపొందుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు