-->

సావిత్రిగారిని చూడగానే నోట మాట రాలేదు: చిరంజీవి 

3 Apr, 2024 02:23 IST|Sakshi
‘సావిత్రి క్లాసిక్స్‌’ పుస్తకావిష్కరణలో ఓ దృశ్యం 

‘‘మహానటి సావిత్రిగారిపై రాసిన ‘సావిత్రి క్లాసిక్స్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించడంతో నా జన్మ సార్థకం అయిందని భావిస్తున్నాను’’ అన్నారు హీరో చిరంజీవి. దివంగత నటి సావిత్రిపై సంజయ్‌ కిశోర్‌ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్‌’ బుక్‌ లాంచ్‌ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘నా తొలి సినిమా ‘పునాదిరాళ్లు’లోనే సావిత్రిగారితో నటిస్తున్నానని తెలియగానే ఒళ్లు జలదరించింది. రాజమండ్రిలోని పంచవటి హోటల్‌లో ఉన్న సావిత్రిగారిని పరిచయం చేసేందుకు నన్ను తీసుకెళ్లారు. ఆమెను చూడగానే నోట మాట రాలేదు. ‘నీ పేరేంటి బాబు’ అని అడిగారామె. చిరంజీవి అన్నాను. ‘శుభం బాగుంది’ అన్నారు.

మరుసటి రోజ వర్షం వల్ల ‘పునాదిరాళ్లు’ షూటింగ్‌ క్యాన్సిల్‌ అయింది. నేను సరదాగా డ్యాన్స్‌ చేస్తూ జారిపడ్డాను. అయినా ఆగకుండా నాగుపాములా డ్యాన్స్‌ చేయడంతో అందరూ క్లాప్స్‌ కొట్టారు. అప్పుడు సావిత్రిగారు ‘భవిష్యత్‌లో మంచి నటుడు అవుతావు’ అని చెప్పిన మాట నాకు వెయ్యి ఏనుగుల బలం అనిపించింది. ‘ప్రేమ తరంగాలు’లో సావిత్రిగారి కొడుకుగా నటించాను. ఆ తర్వాత ఆమెతో నటించే, ఆమెను చూసే చాన్స్‌ రాలేదు. కేవలం కళ్లతోనే నటించగల, హావభావాలు పలికించగల అలాంటి గొప్ప నటి ప్రపంచంలో మరెవరూ లేరు’’ అన్నారు. ఈ వేడుకలో సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, కుమారుడు సతీశ్‌ కుమార్, నటీనటులు జయసుధ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, మురళీ మోహన్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers