సుశాంత్‌కి గుర్తుగానే..

18 Sep, 2020 11:28 IST|Sakshi

కోల్‌కత్తా: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అందర్నీ కలిచివేసింది. అయితే ఆయన మరణించిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక మంది అనేక రకాలుగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్‌లోని అసనోల్స్‌కు చెందిన సుకాంతో రాయ్‌ అనే శిల్పి సుశాంత్‌ మీద ఉన్న అభిమానాన్ని వినూత్న రీతీలో చాటుకున్నారు. తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న మ్యూజియంలో సుశాంత్‌ జ్ఞాపకార్థం ఏకంగా మైనపు విగ్రహాన్నే రూపొందించి వినూత్న రీతిలో నివాళులర్పించారు.

ఈ విషయంపై సుకాంతో రాయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. నేను సుశాంత్‌ను చాలా ఇష్టపడ్డాను. అతను అర్ధాంతరంగా మృతిచెందడం నన్ను మానసిక వేదనకు గురిచేసింది. అతనికి గుర్తుగా నా మ్యూజియం కోసం నేను ఈ విగ్రహాన్ని తయారు చేశాను. అయితే.. సుశాంత్‌ విగ్రహం కోసం అతని కుటుంబ సభ్యులు నన్ను సంప్రదిస్తే మరొక విగ్రహాన్ని తయారు చేస్తాను. అని చెప్పుకొచ్చారు. (దిశ ఫోన్‌ నుంచి పోలీసులకు కాల్‌: నిజమే కానీ)

గతంలో.. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, భారత క్రికెట్‌జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో సహా మరికొందరి ప్రముఖుల మైనపు విగ్రహాలను రాయ్‌ తయారుచేశారు. ఈ విగ్రహాలన్నీ కూడా రాయ్‌ మ్యూజియంలోని ప్రత్యేక సేకరణలో ఒక భాగం. కాగా.. జూన్‌ 14న సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం అతని మరణంపై  సీబీఐ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సహా మూడు కేంద్ర సంస్థలు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. (కృతికి టైం కేటాయించాలి, వాళ్లతో టూర్‌ వెళ్లాలి)

మరిన్ని వార్తలు