Chalapathi Rao: అన్న కంటే ముందే పెళ్లి చేసుకున్న చలపతిరావు

25 Dec, 2022 15:33 IST|Sakshi

టాలీవుడ్‌కు ఈ ఏడాది అస్సలు కలిసిరాలేదు. ఎందరో దిగ్గజ నటులు శాశ్వత వీడ్కోలు తీసుకున్నారు. రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు, సూపర్‌ స్టార్‌ కృష్ణ, విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.. ఈ విషాదాల నుంచి కోలుకోకముందే తాజాగా చలపతిరావు మృతి చెందడంతో టాలీవుడ్‌ శోకసంద్రంలో ముగినిపోయింది.

మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆయన మొదట నాటకాలు వేసేవారు. ఎన్టీ రామారావు చొరవతో వెండితెరపై అడుగుపెట్టారు. నటనలో విజృంభించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సినిమాల్లోకి రావడానికంటే ముందు ఒక అమ్మాయి తన దగ్గరకు వచ్చి ప్రపోజ్‌ చేయగా ఆమెనే పెళ్లి చేసుకున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు చలపతి.

'నేను బందరులో ఇంటర్మీడియట్‌ చదువుతున్న రోజులవి. అక్కడే నా ప్రేమకథ మొదలైంది. ఇందుమతి నా క్లాస్‌మేట్‌, చాలా మంచిది. నాలో ఏం చూసిందో, నేనెందుకు నచ్చానో తెలియదు కానీ ఒకరోజు సరాసరిగా నా దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుంటావా? అని అడిగింది. నేను ఆశ్చర్యంతో.. నీకు నేనంటే ఇష్టమా? అని అడిగాను, అవునని తలూపింది. అప్పుడు నాకు 19 ఏళ్లు. మా మధ్య ప్రేమలేఖలు లాంటివి ఏమీ లేవు. ఇంట్లో చెప్తే ఒప్పుకోలేదు. నీకంటే పెద్దవాడు ఇంట్లో ఉండగా అప్పుడే నీకెలా పెళ్లి చేస్తామన్నారు. కానీ వారం రోజుల్లో ఫ్రెండ్స్‌ అంతా కలిసి బెజవాడలో మా పెళ్లి జరిపించారు. ఈ విషయం తెలిసి మా అన్నయ్య ఒకటే ఏడుపు.

ఎందుకంటే పల్లెటూర్లలో పెద్దవాళ్లకు పెళ్లి చేయకుండా చిన్నవాళ్లకు చేయరు. అలాంటిది నాకు పెళ్లైపోందని తెలిస్తే తనకెవరు పిల్లనిస్తారని ఒకటే శోకం పెట్టాడు. తర్వాత నేనే అతడికి మంచి సంబంధం చూసి వివాహం జరిపించా. అనంతరం మేము బెజవాడకు షిఫ్ట్‌ అయ్యాం. అప్పటికి నేను ఓపక్క చదువుతూనే నాటకాలు వేసేవాడిని. ఓసారి తస్మాత్‌ జాగ్రత్త నాటకానికి హీరోయిన్‌ దొరక్కపోతే మా ఆవిడతో చేయించా. ఆమె ఏకంగా ఉత్తమనటి అవార్డు దక్కించుకుంది. తర్వాత మద్రాసు వెళ్లిపోయాం. నా జీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో ఈవీవీ సత్యనారాయణ 'మా నాన్నకు పెళ్లి' సినిమా తీశారు. అది నా కథే' అని గతంలో చలపతిరావు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

చదవండి: చలపతిరావు రెండో పెళ్లికి రవిబాబు ప్రయత్నాలు.. కానీ!
సీనియర్‌ నటుడు చలపతిరావు కన్నుమూత

మరిన్ని వార్తలు