Kaikala Satyanarayana : నింగికేగిన కైకాల..

24 Dec, 2022 00:54 IST|Sakshi

అసలు విలన్‌లా వికటాట్టహాసం చేసినా.. 
పక్కన చిన్న విలన్‌ కమ్‌ కమెడియన్‌గా 
డైలాగులు పలికినా.. ‘యముండా’ అంటూ 
గర్జించినా.. తండ్రిగా, తాతగా ప్రేమను 
కురిపించినా.. హీరో, విలన్, క్యారెక్టర్‌ 
ఆర్టిస్ట్‌ ఇలా పాత్ర ఏదైనా.. సాంఘికం, 
పౌరాణికం, జానపదం జానర్‌ ఏదైనా.. మూడు తరాల ప్రేక్షకులను ముచ్చటగా అలరించిన 
నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ. తెలుగు సినీ అభిమానులను విషాదంలో ముంచుతూ దివికేగారు.

సాక్షి, హైదరాబాద్‌/ న్యూఢిల్లీ: వందల సిని­మా­లు.. ఎన్నో రకాల పాత్రలు.. అన్నింటా తనదైన ముద్ర వేసి నవరస నటనా సార్వభౌముడు అనిపించుకున్న కైకాల సత్యనారాయణ (87) ఇకలేరు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య నాగేశ్వరమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కైకాల మృతితో చిత్ర పరిశ్రమ­తోపాటు ఆయన అభిమానుల్లో విషాదం నెలకొంది. పలువు­రు సినీ, రాజకీయ ప్రముఖులు సత్యనా­రా­యణ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. సినీ హీరోలు చిరంజీవి, పవన్‌కల్యాణ్, వెంకటేశ్, దర్శకులు కె.రాఘవేందర్‌రావు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్, బాబీ, నిర్మాత చినబాబు తదితరులు ఇందులో ఉన్నారు.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
కైకాల సత్యనారాయణ భౌతికకాయానికి శనివారం ఉదయం పదిన్నర గంటలకు ఫిలింనగర్‌లోని మహాప్రస్థానంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరనున్నాయి. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వపరంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. కైకాల తన నటనతో మూడు తరాల ప్రేక్షకులను అలరించారని.. ఆయన మృతి తెలుగు చిత్రసీమకు తీరని లోటు అని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.

జానర్‌ ఏదైనా.. పాత్ర ఎలాంటిదైనా..
ఏపీలోని కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో 1935 జూలై 25న కైకాల సత్యనారాయణ జన్మించారు. గ్రామంతోపాటు గుడ్లవల్లేరు, గుడివాడ, విజయవాడలలో చదువుకున్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడే సత్యనారాయణ పలు నాటకాల్లో పాత్రలు పోషించారు.

ఆజానుబాహుడు కావడంతో సినిమాల్లో ప్రయత్నించాలని స్నేహితులు సూచించడంతో 1956 సెప్టెంబర్‌ 27న మద్రాసులో (చెన్నై)లో అడుగుపెట్టారు. కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినా చేజారిపోయాయి. 1959లో ‘సిపాయి కూతురు’ సినిమాలో తొలుత అవకాశం వచ్చింది. తర్వాత ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ సినిమాలో ముగ్గురు హీరోల్లో ఒకరిగా చేశారు.

ఆ సమయంలో దర్శకుడు విఠలాచార్య ప్రోత్సాహంతో విలన్‌ వేషాలకు ఓకే చెప్పారు. ఎన్టీఆర్‌ హీరోగా తీసిన ‘అగ్గిపిడుగు’లో విలన్‌గా సత్యనారాయణకు మంచిపేరు వచ్చింది. ఎన్టీఆర్‌ ఏ సినిమా చేసినా కైకాల విలన్‌గా ఉండేవారు. ఎన్టీఆర్‌తో రూపురేఖలు దగ్గరగా ఉండటంతో కొన్ని సినిమాల్లో ఆయనకు డూప్‌గా కూడా చేశారు. మరోవైపు పౌరాణిక చిత్రాల్లోనూ నటనా కౌశలాన్ని చూపారు. శ్రీకృష్ణార్జున యుద్ధం, లవకుశ, నర్తనశాల, దానవీరశూరకర్ణ వంటి సినిమాల్లోని వివిధ పాత్రలతోపాటు యముడి పాత్రల్లో ‘యముండా’ అంటూ విజృంభించారు.

రమా ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ పేరిట పలు సినిమాలు నిర్మించారు. తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ నటించారు. కైకాల సత్యనారాయణ నటించిన చివరి చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రంలో హీరోయిన్‌కు తాతగా నటించారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన కైకాల.. ఆరు దశాబ్దాల కెరీర్‌లో సుమారు ఎనిమిది వందల చిత్రాల్లో నటించారు. అయితే తన నటవారసులుగా కుమారులను ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు.

ఎన్టీఆర్‌ స్ఫూర్తితో రాజకీయాల్లోకి..
ఎన్టీఆర్‌ స్ఫూర్తితో కైకాల సత్యనారాయణ రాజకీయాల్లోకి కూడా వచ్చారు. 1996లో టీడీపీ తరఫున మచిలీపట్నం ఎంపీగా గెలిచారు. తర్వాత మరోసారి పోటీచేసి ఓటమిపాలయ్యారు. పలు ప్రజాసేవా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. తాత పేరిట కౌతవరంలో ప్రభుత్వ సాయంతో ప్రసూతి కేంద్రాన్ని స్థాపించారు.

తెలుగువారు గర్వించదగ్గ నటుడు కైకాల: సీఎం కేసీఆర్‌
కైకాల సత్యనారాయణ మరణవార్త తెలిసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫిలింనగర్‌లోని నివాసానికి వచ్చారు. పార్థివదేహం వద్ద నివాళులు అర్పించి.. కైకాల కుటుంబ సభ్యులను పరామర్శించారు. హీరోలతో సమానంగా కైకాల సత్యనారాయణకు గ్లామర్‌ ఉండేదని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘కైకాల సత్యనారాయణ మరణం బాధాకరం. ఆయన ఏ పాత్రలో అయినా హీరోలతో పోటీపడుతూ అద్భుతంగా నటించేవారు.

తన వైవిధ్యమైన నటనతో మూడు తరాల ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ నటుడు. ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు..’’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కైకాల ఎంపీగా ఉన్న సమయంలో కొంతకాలం కలిసి పనిచేశానని కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వెంట ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, బాల్క సుమన్, మరికొందరు నేతలు ఉన్నారు.

ప్రధాని మోదీ సంతాపం
సినీనటుడు కైకాల సత్యనారాయణ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్‌ చేశారు. ‘‘ప్రసిద్ధ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ గారి మృతి పట్ల చింతిస్తున్నాను. విభిన్న పాత్రలతో, అద్భుత నటనా చాతుర్యంతో ప్రేక్షకులకు ఆయన చిరపరిచితులు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’ అని పేర్కొన్నారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కూడా కైకాల మృతిపట్ల సంతాపం తెలిపారు.

ప్రజల మదిలో నిలిచిపోతారు: తమిళిసై
కైకాల సత్యనారాయణ మృతిపట్ల గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నటుడిగా, ఎంపీ సేవలందించిన ఆయన మరణం తెలుగు ప్రజలకు, సినీ రంగానికి తీరని లోటు అని.. కైకాల నవరస నటనా సౌర్వభౌముడిగా ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.
తెలుగు ప్రజలకు తీరని లోటు: రేవంత్‌రెడ్డి
విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వందల సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న కైకాల మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు