సీనియర్‌ నటుడికి అత్యవసర చికిత్స

10 Apr, 2021 13:08 IST|Sakshi

చెన్నై: సీనియర్‌ నటులు కార్తీక్‌కు వైద్యులు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. బహుభాషా నటుడు కార్తీక్‌ చాలాకాలం క్రితమే రాజకీయ రంగప్రవేశం చేశారు. అయితే  కొంతకాలం తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చాలా గ్యాప్‌ తర్వాత కార్తీక్‌ మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. అలాంటిది ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆయన అన్నాడీఎంకే పార్టీకి ప్రచారం చేస్తారని ప్రకటించారు. అన్నట్టుగానే ప్రచారంలో పాల్గొన్న కార్తీక్‌ గత నెల 21న అనూహ్యంగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను  కుటుంబ సభ్యులు స్థానిక ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చేర్చారు. శ్వాస సంబంధిత సమస్యలతోపాటు, రక్తపోటు కారణంగా కార్తీక్‌ అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు గుర్తించారు.

దీంతో ఆయన కొన్ని రోజులు ఆస్పత్రిలోనే వైద్య చికిత్సలు పొంది ఆరోగ్యం చేకూరడంతో ఇంటికి వచ్చారు. ఆ తర్వాత కూడా కార్తీక్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలా ఇటీవల ప్రచార కార్యక్రమాలు ముగించుకొని తిరిగి రాగా మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కార్తీక్‌ను మళ్లీ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన అత్యవసర చికిత్స వార్డులో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్‌ అని తేలింది. అయినా కార్తీక్‌ శ్వాసకోశ సమస్య తీవ్రత తగ్గలేదు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. 
చదవండి:  మళ్లీ అనారోగ్యానికి గురైన సీనియర్‌ నటుడు కార్తీక్

మరిన్ని వార్తలు