Vellanki Nagineedu: నాకు అవకాశాలు ఇవ్వరు, నన్ను ఆదుకోరు అన్న భయం..

23 Feb, 2023 20:37 IST|Sakshi

మర్యాద రామన్న సినిమా పేరు చెప్పగానే సునీల్‌తో పాటు గుర్తొచ్చే నటుడు వెల్లంకి నాగినీడు. ఈ సినిమాతో నంది అవార్డు అందుకున్న ఆయన ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించారు. నాగినీడు గతంలో ప్రసాద్‌ ల్యాబ్‌లో జనరల్‌ మేనేజర్‌గా పనిచేసేవారు. సినిమా ప్రివ్యూలు చూసి ఏది ఆడుతుంది, ఏది ఆడదనేది ముందుగానే ఊహించేవారు. అయితే తనకు నటించాలని ఉందన్న విషయాన్ని కానీ, అవకాశాలు ఇవ్వమని కానీ ఎవరినీ నోరు తెరచి అడగలేదు. ఈ క్రమంలో 2010లో వచ్చిన మర్యాద రామన్న చిత్రంలో నటుడిగా విశ్వరూపం చూపించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

'ప్రసాద్‌ ల్యాబ్‌కు దాసరి నారాయణరావు, కృష్ణ, రాఘవేంద్రరావు, కృష్ణంరాజు.. ఇలా చాలామంది వచ్చేవారు. కానీ ఎన్నడూ నాకు యాక్టింగ్‌ అంటే ఇంట్రస్ట్‌.. ఛాన్సులు కావాలని అడగలేదు. ఇకపోతే మర్యాద రామన్నలో నేను చేసిన పాత్ర నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే నాది రాయలసీమ. మీరు ఇచ్చేదానికి రెట్టింపు మర్యాద నేనిస్తా, అలాగే ఏదైనా తేడా చేస్తే అంతకు మించి తేడా చేస్తా. తప్పు జరిగిన చోట నేను ఫ్యాక్షన్‌ లీడర్‌లా నిలబడతా. 9, 10వ తరగతికే థియేటర్‌కు వెళ్లి టికెట్లు ఇచ్చేవాడిని. ఎవడైనా బ్లాక్‌లో టికెట్లు అమ్మితే కొట్టేసేవాడిని. నా గురించి నాకు ఎలాంటి భయం లేదు. నాకెవరూ మార్గం చూపించరు.. నాకు అవకాశాలు ఇవ్వరు.. నన్ను ఆదుకోరు అన్న భయాలు నాకు లేవు. అది పొగరు కాదు, నాపై నాకున్న నమ్మకం' అని చెప్పుకొచ్చారు నాగినీడు.

చదవండి: నటి మృతి.. తన మరణానికి కారణమదేనా? వైరలవుతున్న వీడియో

మరిన్ని వార్తలు