Dr N Vijayalakshmi: 66 ఏళ్ల వయసులో పెళ్లి.. భర్త ముందే పిల్లలు కొట్టేవాళ్లు, కోట్ల ఆస్తి కోసమే!

27 Jul, 2023 16:37 IST|Sakshi

ఇష్టానికి వయసుతో పనేంటి? నటన మీద ఆమెకున్న మక్కువ 71 ఏళ్ల వయసులో తనను ఇండస్ట్రీ వైపు అడుగులు వేయించేలా చేసింది. డాక్టర్‌, రచయిత్రి, కవయిత్రి, క్లాసికల్‌ డ్యాన్సర్‌, లాయర్‌.. ఇలా భిన్న రంగాల్లో ఆరితేరిన ఆమె రిటైర్‌మెంట్‌ తీసుకునే సమయంలో నటనా రంగంలో ఎంట్రీ ఇచ్చింది. షార్ట్‌ ఫిలింస్‌తో గుర్తింపు తెచ్చుకున్న బామ్మ తర్వాత ఏకంగా పెద్ద హీరోలతో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ బామ్మ పేరు విజయలక్ష్మి. కానీ తన జీవిత ప్రయాణాన్ని చూస్తే ఆమెను ధైర్యలక్ష్మి అని మెచ్చుకుని తీరాల్సిందే!

సలార్‌, పుష్ప 2లో బామ్మ
తాజాగా ఈ నటి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. నటి విజయలక్ష్మి మాట్లాడుతూ.. 'నేను మొదట షార్ట్‌ ఫిలింలో నటించాను. అది బాగా క్లిక్‌ అయింది. అలా మరికొన్ని షార్ట్‌ ఫిలింస్‌ చేశాను. వెండితెరపై తొలిసారిగా రాజరాజ చోళ చిత్రం చేశాను. విరూపాక్ష, ఆచార్య, పొన్నియన్‌ సెల్వన్‌ 2.. ఇలా చాలా సినిమాలు చేశాను. సలార్‌, పుష్ప 2 కూడా చేస్తున్నాను. ఈ ఏడాది 12 సీరియల్స్‌ చేశాను. ఇంకా చాలా అవకాశాలు వస్తున్నాయి. సంతోషంగా ఉంది.

11 ఏళ్లకే తండ్రి కన్నుమూత
నా కుటుంబ విషయానికి వస్తే.. నాకు ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. అందులో ఒకరైన నా మిలటరీ తమ్ముడు(60) ఈ మధ్యే చనిపోయాడు. తనంటే నాకెంతో ఇష్టం. తను చనిపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. నా తోబుట్టువలను చిన్నప్పటి నుంచి నేనే పెంచి పెద్దవాళ్లను చేశాను. నా 11 ఏళ్ల వయసులో నాన్న చనిపోయారు. మేనమామలు అప్పుడే నాకు పెళ్లి చేస్తా అంటే ఒప్పుకోలేదు. ముందు నా తమ్ముళ్లను బాగా చదివించి గొప్ప స్థానానికి తీసుకెళ్లాలనుకుంటున్నానని చెప్పాను. వారిని మంచి స్థానంలో చూడాలనుకున్నాను. అలా నా పెద్ద తమ్ముడు మిలటరీకి వెళ్లాడు. రెండో తమ్ముడు బ్యాంక్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. చెల్లె గృహిణిగా ఉంది.

భార్య చనిపోయిన వ్యక్తితో పెళ్లి
బాధ్యతలు అన్నీ తీరిపోయాక 32 ఏళ్ల వయసులో నా కోరిక తీర్చుకుందామని ఆంధ్ర నాట్యం నేర్చుకున్నాను. తర్వాత ఓ ప్రోగ్రామ్‌లో కింద పడటంతో కాలుకు దెబ్బ తగిలి డ్యాన్స్‌కు దూరమయ్యాను. 66 ఏళ్ల వయసులో నాకంటూ ఓ తోడుండాలని మామయ్య నాతో పెళ్లివైపు అడుగులు వేయించారు. భార్య చనిపోయిన ఓ రైల్వే ఉద్యోగిని నాకిచ్చి పెళ్లి చేశారు. అప్పటికే ఆయనకు ఇద్దరు పిల్లలు, కోట్ల ఆస్తి ఉంది. ఆస్తి కోసం అతడిని పెళ్లి చేసుకున్నానన్న బద్నాం నాకు వద్దని అతడి ఆస్తినంతా తన కుమారుల పేరిట రాసిచ్చాకే వివాహానికి ఒప్పుకుంటానన్నాను. ఆస్తిని రాసిచ్చేశానని ఆయన అబద్ధం చెప్పాడు. అది అబద్ధమని తర్వాత తెలిసింది. మాపెళ్లి జరిగాక అసలు కష్టాలు మొదలయ్యాయి.

నా భర్త బతికున్నాడో లేదో కూడా తెలియదు
నన్ను ఇంట్లోవాళ్లే బెదిరించారు, రాచిరంపాన పెట్టారు. ఆయన మనవళ్లు నన్ను ఇంట్లో నుంచి వెళ్లిపోతావా? లేదా? తనతో ఎలాగైనా ఆస్తి రాయించమని కొడుతుంటే కూడా నా భర్త మౌనంగా ఉండేవాడు. ఆయన ఆస్తి రాయడు, వీళ్లు హింసలు పెట్టడం మానరు. పెళ్లయ్యాక నెల రోజులు మాత్రమే అక్కడున్నాను. వాళ్ల చిత్రహింసలు తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. 2016 నుంచి ఇప్పటివరకు ఆయన ఎలా ఉన్నాడో కూడా తెలియదు. అసలు బతికున్నాడో లేదో కూడా తెలియదు.

నా శవాన్ని అక్కడివ్వండి
నేను ఎవరికీ భారం కాను. కాళ్లూచేతులు బాగున్నన్నాళ్లు పని చేస్తాను. తర్వాత అనాధాశ్రమానికి వెళ్లిపోతాను. నేను చనిపోయాక నా శవాన్ని కర్నూలులోని జనరల్‌ ఆస్పత్రిలో అప్పగించమని కోరుతున్నాను. ఎందుకంటే ఈమేరకు నేను నా శరీరాన్ని మెడికల్‌ స్టూడెంట్స్‌కు దానం చేసేందుకు ఒప్పుకున్నాను. వీలైతే నా జీవిత కథను పది అధ్యాయాలుగా పుస్తకంగా తేవాలన్నదే నా ఆశయం' అంటూ తన కన్నీటి కష్టాలను చెప్పుకొచ్చింది విజయలక్ష్మి.

చదవండి: పెళ్లై 8 ఏళ్లయినా పిల్లలు లేకపోవడంతో ఐవీఎఫ్‌.. నాలుగోసారికి సక్సెస్‌.. కానీ
రౌడీ హీరో షర్ట్‌ వేసుకున్న రష్మిక మందన్నా, మళ్లీ దొరికిపోయిందిగా

మరిన్ని వార్తలు