Actress Krishnaveni: ఆమె నా భర్తను హత్య చేయించింది: నటి కృష్ణవేణి

17 Feb, 2022 19:19 IST|Sakshi

1979లో 'నగ్న సత్యం' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది నటి కృష్ణవేణి. 43 సంవత్సరాల కెరీర్‌లో హీరోయిన్‌గా, సహాయక నటిగా, కమెడియన్‌గా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించిందావిడ. సుమారు 200కు పైగా సినిమాల్లో నటించిన ఆమె తన జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించింది.

'నేను 'వారాలబ్బాయి' డైరెక్టర్‌ రాజచంద్రను పెళ్లి చేసుకున్నాను. అప్పటికే ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. వాళ్లు ఏమీ లేనివారు. ఇంటి అద్దె కట్టుకోవడానికి కూడా కష్టాలు పడ్డారు. తీరా ఒక్కో మెట్టు ఎదిగి ఒక సినిమాకు రెండు, మూడు లక్షల రూపాయలు తీసుకునే సమయానికి చచ్చిపోయాడు. మేం ఇద్దరం పెళ్లి చేసుకున్నాక కలిసి నాలుగేళ్లున్నాం. నిజానికి నాకు నలుపంటేనే నచ్చదు. టీ నల్లగా ఉంటేనే తాగను, అలాంటిదాన్ని అనుకోని పరిస్థితుల వల్ల నల్లగా ఉండే అతడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీలాంటోళ్లు నాకు హెల్ప్‌గా ఉంటే నేనెక్కడో ఉండేవాడిని అని తరచూ అంటుండేవాడు.

ఆయన తీసిన ఎన్నో సినిమాలు వందరోజులు ఆడాయి. ఇది చూసి ఓర్వలేక ఇండస్ట్రీవాళ్లే ఆయనను హత్య చేశారు. కరెంట్‌ వైర్లతో కాల్చి, పీక పిసికి ఊపిరాడకుండా చేసి చంపేశారు. పోలీసువాళ్లు కూడా ఎవరు చేయించారో మాకు తెలుసు, కానీ మేం ఏం చేయలేం అని చేతులెత్తేశారు. మా కుటుంబాన్ని లేపేస్తామని బెదిరింపులు రావడంతో  పోలీసులు రెండేళ్లపాటు ఇంటిచుట్టూ కాపలాగా ఉన్నారు. దీనికంతటికీ కారణమైన హీరోయిన్‌ చనిపోయింది' అని చెప్పుకొచ్చింది కృష్ణవేణి. కానీ ఆ హీరోయిన్‌ ఎవరన్న విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.

మరిన్ని వార్తలు