ఎల్‌. విజయలక్ష్మికి ఎన్టీఆర్‌ అవార్డు

27 Oct, 2022 00:52 IST|Sakshi

అలనాటి అందాల తార, ప్రముఖ నర్తకి ఎల్‌. విజయలక్ష్మిని ఎన్టీఆర్‌ అవార్డు వరించింది. తెనాలిలో జరుగుతున్న ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్‌ నటించిన అన్ని సినిమాలు ఏడాది పాటు పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్లో ప్రదర్శితమవుతున్నాయి. ఇక్కడ జరిగే కార్యక్రమంలో ప్రతి నెలా ఎన్టీఆర్‌ కుటుంబం నుండి ఒకరు పాల్గొంటారు. ఎన్టీఆర్‌తో పనిచేసిన ఒక లెజెండరీ పర్సన్‌కు ప్రతి నెలా అవార్డు, గోల్డ్‌ మెడల్‌ ప్రదానం చేస్తారు. అక్టోబర్‌ నెలకిగాను ఎన్టీఆర్‌  పురస్కారానికి ఎల్‌. విజయలక్ష్మి ఎంపికయ్యారు.

బాలనటిగా ‘సిపాయి కూతురు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె ‘జగదేకవీరుని కథ, ఆరాధన, గుండమ్మ కథ, నర్తనశాల, పూజా ఫలం, బొబ్బిలి యుద్ధం, రాముడు–భీముడు, భక్త ప్రహ్లాద’ వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌తో సుమారు 15 సినిమాలకు పైగా నటించారు విజయలక్ష్మి. 50 ఏళ్ల  క్రితం పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరంగా అమెరికాలో స్థిరపడ్డారామె. ఈ నెల 30న తెనాలిలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకోవడానికి ఆమె ఇక్కడికి రానున్నారు. కాగా ‘ఎన్టీఆర్‌ శతజయంతి’ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షుడిగా నందమూరి బాలకృష్ణ, అధ్యక్షుడిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్,
కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బుర్రా సాయిమాధవ్‌ వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వార్తలు