డైరెక్టర్ చెబితే అక్కడి నుంచి పారిపోదామనుకున్నా: సీనియర్ నటి రజినీ

1 Feb, 2023 16:17 IST|Sakshi

రజని అంటే ఇప్పటి టాలీవుడ్ అభిమానులకు గుర్తుకు రాకపోవచ్చు. కానీ అప్పటి తెలుగు సినిమా అభిమానులకు ఆమె సుపరిచితురాలు. ఆ కాలంలో ఆమె అందాల నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరిగా నిలిచింది. దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె ఆగ్ర హీరోల సినిమాల్లోనూ కనిపించింది. ఎలాంటి సినీ నేపథ్యం లేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 1985లో ‘బ్రహ్మముడి’ అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు రజనీ. తొలి సినిమాతో మంచి గుర్తింపు రావడంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. సీతారామ కల్యాణం, రెండు రెళ్ల ఆరు, అహ నా పెళ్లంట చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, మజ్నులో నాగార్జున , సీతరాముల కల్యాణంలో బాలకృష్ణ సరసన నటించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తెలుగు సినిమాల్లో ఎంట్రీపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

రజిని మాట్లాడుతూ..' దాసరి నారాయణరావు నుంచి ఫోన్ వచ్చింది. మా అన్నయ్య దాసరి వద్దకు వెళ్లారు. ఈ సినిమాలో మీ చెల్లెలు హీరోయిన్ అని చెప్పారు. నాన్నను అడిగితే నీకు ఇష్టమైతే చేయి అన్నారు. నీ లైఫ్ నీ ఇష్టం అన్నారు. అప్పట్లో డీడీలో తెలుగు నెలకొకసారి వచ్చేది. నాకేమో తెలుగు రాదు. ఫస్ట్ డేనే కాలేజీ బ్యాక్‌గ్రౌండ్‌లో సీన్. ఈ డైలాగ్స్ అన్నీ మీవే అని ఒకాయన ఓ పది పేజీల నా చేతిలో పెట్టారు. అప్పుడే నాకు చాలా భయమేసింది. ఇక డైరెక్టర్ వస్తే బయటకు పో అనడం ఖాయమని ఫిక్స్ అయిపోయా. ఆయన చెప్పిన వెంటనే వెళ్లిపోదామనుకున్నా. నాకు తెలుగులో నమస్కారం తప్ప ఏమీ రాదు. కాసేపటికే దాసరి నారాయణరావు వచ్చారు. ఆ డైలాగ్ చెప్పడం రాదు సార్ అన్నా. వెంటనే డైలాగ్ పేపర్ ఇచ్చిన ఆయన్ను పిలిచి బయటకు పంపారు. ఆ డైలాగ్ పేపర్ తీసుకుని అవీ చదవడం నాకే కష్టంగా ఉంది నీకెలా వస్తాయన్నారు. ఆ క్షణం నాకు దేవుడిలా కనిపించారు. అప్పుడే ఆయనను గురువుగా భావించా. అంతవరకు వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న నేను కాస్త కూల్ అయ్యా. 1234 వచ్చా అన్నారు. ఏ భాషలోనైనా చెప్పు.. ఏమీ రాకపోతే 1234 చెప్పు చాలు అన్నారు. నా ఫస్ట్ మూవీలో నంబర్స్‌తోనే నేను డైలాగ్స్ చెప్పా. బ్రహ్మముడి సినిమాతో నా కెరీర్‌లో తెలుగులో ప్రారంభమైంది. నేను తెలుగులో మాట్లాడాతుంటే నవ్వడం స్టార్ట్ చేస్తారు. ' అంటూ చెప్పుకొచ్చింది అలనాటి అందాల నటి రజినీ. 
 

మరిన్ని వార్తలు