ఆ‍స్తినంతా ఇచ్చేశాను.. సెంటు భూమి లేదు.. లక్షల పారితోషికం అందుకునే రవళి వెండితెరకు ఎందుకు దూరమైందో చెప్పిన హీరోయిన్‌ తల్లి

30 Sep, 2023 16:51 IST|Sakshi

సినిమాల్లో కనిపిస్తే చాలనుకునేవారు కొందరైతే సినిమా ఇండస్ట్రీనే ఏలేయాలనుకునేవాళ్లు మరికొందరు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేవాళ్లు కూడా ఉంటారు. అలాంటి కోవలోకే వస్తుంది సినీనటి విజయదుర్గ. 1987లో తన ముగ్గురు పిల్లల్ని చేతపట్టుకుని చెన్నపట్నం(ప్రస్తుత చెన్నై) వెళ్లింది. కష్టాలను లెక్కచేయకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. ఛాన్సులు చేజిక్కించుకుంది, విజయాలను అందుకుంది. ఆమె ఇద్దరు కూతుర్లు రవళి, హరితలు కూడా నటనారంగంలో కీర్తిప్రతిష్టలు అందుకున్నారు.

మా అసలు పేర్లు ఇవీ..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయదుర్గ ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నా అసలు పేరు కనకదుర్గ. మాది గుడివాడ. చెన్నైలో ఓసారి దసరా నవరాత్రులకు వెళ్లాను. అక్కడి వాతావరణం నచ్చడంతో పిల్లలను తీసుకుని చెన్నై షిఫ్ట్‌ అయ్యాను. పిల్లల్ని క్లాసికల్‌ డ్యాన్స్‌లో శిక్షణ ఇప్పించాను. అక్కడికి వెళ్లిన నాలుగు నెలలకే.. రఘువరన్‌ హీరోగా ఎస్‌పీ ముత్తరామన్‌ డైరెక్ట్‌ చేసిన ఓ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అప్పటికే కనకదుర్గ పేరిట ఓ నటి ఉండటంతో నా పేరును విజయదుర్గగా మార్చారు.


నటి హరిత దంపతులు

పెళ్లి సందడితో ఫుల్‌ క్రేజ్‌
తమిళంలో 15, తెలుగులోనూ దాదాపు 15 చిత్రాలు చేశాను. నా కూతురు హరిత(అసలు పేరు శాంతి) మొదట హీరోయిన్‌గా చేసింది. పొట్టిగా ఉందంటూ తనకు సిస్టర్‌ క్యారెక్టర్స్‌ ఇచ్చారు. ప్రస్తుతం తను బుల్లితెరపై రాణిస్తోంది. ఆ తర్వాత నా కొడుకు విజయ్‌ (అసలు పేరు శేషు) హీరోగా ఓ సినిమా చేశాడు, కానీ అది విడుదల చేయలేదు. పెళ్లి సందడి సినిమాకు నా కూతురు రవళి(అసలు పేరు శైలజ)కి రూ.50 వేలు ఇచ్చారు. తర్వాత మాత్రం లక్షల్లో అందుకుంది.

ఆ ప్రచారం వల్లే కెరీర్‌ నాశనం
తన కెరీర్‌ ఊపులో ఉన్న సమయంలో రవళి లావైపోయిందని వార్తలు రాశారు. ఆ ప్రచారం వల్ల తన కెరీర్‌ నాశనమైంది. చెప్పుకోదగ్గ పాత్రలు, సినిమాలు రాలేదు. పెళ్లి చేసుకుని సినిమాలు మానేద్దామనుకుంది. ఆ సమయంలో చిరంజీవి స్టాలిన్‌ మూవీలో ఛాన్స్‌ వచ్చింది. అలా కొన్ని చిత్రాలు చేసి 2011లో సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది. త్వరలోనే తను రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. నా ఆస్తి అంతా ముగ్గురికీ సమానంగా పంచాను. నా దగ్గర సెంటు భూమి కూడా పెట్టుకోలేదు. ఉన్నదంతా ఇచ్చేశాను' అని చెప్పుకొచ్చింది.

చదవండి: నాకు లవ్‌ మ్యారేజ్‌ ఇష్టం, ముందు సహజీవనం చేస్తా, అప్పుడే పచ్చబొట్టు వేయించుకుంటా!

మరిన్ని వార్తలు