మరో విషాదం.. సీనియర్ రచయిత కన్నుమూత

12 Feb, 2023 19:12 IST|Sakshi

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే సింగర్ వాణీ జయరాం మృతి చెందగా.. తాజాగా మరో సినీ రచయిత, సెన్సార్ బోర్డ్ మెంబర్ యడవల్లి వెంకట లక్ష్మి నరసింహశాస్త్రి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.  చిత్రసీమలో యడవల్లిగా పేరుగాంచారు. పలు తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలకు రచనలు చేశారాయన.

నెల్లూరులో జన్మించిన యడవల్లి

ఆయన స్వస్థలం నెల్లూరు కాగా.. విజయవాడలో స్థిరపడ్డారు. చిన్న వయసులోనే 'నక్షత్రాలు' పేరుతో వచన కవితా సంపుటిని వెలువరించారు. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన వచన కవితా సారథి కుందుర్తి ఆంజనేయులు, యడవల్లి కవితలను ప్రశంసించారు. ఈ పుస్తకాన్ని తన గురువు ఆరుద్రకి యడవల్లి అంకితం ఇచ్చారు. అలానే 'విరిగిన కొమ్మకు విరిసిన మల్లెలు' పేరుతో నవల రాశారు. విజయవాడలో రాధాకృష్ణమూర్తి అనే సినీ నిర్మాత ద్వారా చిత్రసీమలోకి యడవల్లి అడుగు పెట్టారు. మాదిరెడ్డి సులోచన రాసిన 'తరం మారింది' అనే నవలను అదే పేరుతో రాధాకృష్ణమూర్తి తీసిన సినిమాకు తగిన విధంగా భాషనూ, యాసనూ సమకూర్చడానికి యడవల్లి సాయం చేశారు. 

వెంకయ్య నాయుడు ప్రశంసలు

తెలుగు సినిమాల్లో హాస్యం, తెలుగు సినీ దర్శక మాలిక - విజయ వీచిక, 'తెలుగు చిత్రాలలో ప్రగతి కిరణాలు' లాంటి పుస్తకాలను ఆయన రచించారు. పలు టీవీ సీరియల్‌కు కథలు - మాటలు సమకూర్చారు. వెంకయ్య నాయుడు భారత ఉప రాష్ట్రపతిగా సేవలు అందిస్తున్న సమయంలో తన రచనలను వారికి అందించి, అభినందనలు పొందారు.  యడవల్లి  ప్రస్తుతం కేంద్ర సెన్సార్ బోర్డ్ (సీబీఎఫ్‌సీ) సభ్యునిగా సేవలు అందిస్తున్నారు. ఆదివారం ఉదయం విజయవాడలో యడవల్లి అంత్యక్రియలు ముగిశాయి. 

మరిన్ని వార్తలు