టాలీవుడ్‌లో విషాదం.. గుండెపోటుతో దర్శకుడు మృతి

9 Jan, 2024 10:27 IST|Sakshi

ప్రముఖ జర్నలిస్ట్, సినీ దర్శకుడు కె. జయదేవ్‌ సోమవారం రాత్రి గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి చెందారు. పలు షార్ట్‌ ఫిలింస్‌కి దర్శకత్వం వహించిన జయదేవ్‌ ‘కోరంగి నుంచి’ (2022) అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎఫ్‌డీసీ) నిర్మించింది. మంచి చిత్రాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎన్‌ఎఫ్‌డీసీ ప్రతి ఏడాది కొన్ని చిత్రాలకు ఫండింగ్‌ ఇస్తుంది.

అందులో భాగంగా ‘కోరంగి నుంచి’కి కోటి రూపాయల ఫండింగ్‌ ఇచ్చారు. 25 ఏళ్ల తర్వాత నటి అర్చన ఈ సినిమాలో నటించటం విశేషం. ఈ చిత్రం పలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ప్రముఖ దర్శకుడు, జర్నలిస్టు కేఎన్‌టీ శాస్త్రికి జయదేవ్‌ చిన్న కుమారుడు. గతంలో ఎన్‌ఎఫ్‌డీసీ నిర్మించిన ‘తిలదానం’ చిత్రదర్శకుడు కేఎన్‌టీ శాస్త్రి అనే సంగతి తెలిసిందే. జయదేవ్‌కు భార్య యశోద, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

>
మరిన్ని వార్తలు