ఏడేళ్ల ప్రేమకు బ్రేక్‌ పడింది..

6 Dec, 2020 09:12 IST|Sakshi

తుఝ్‌సే  నారాజ్‌ నహీ జిందగీ.. హైరాన్‌ హూ మై, హో హైరాన్‌ హూ మై తెరే మాసూమ్‌ సవాలోంసే పరేషాన్‌ హూ మై, హో పరేషాన్‌ హూ..(జీవితమా నీ మీద అలకలేదు కాని ఆశ్చర్యమేస్తోంది.. నీ అమాయకమైన ప్రశ్నలతో ఆందోళన కలుగుతోంది) అనే పాట ‘మాసూమ్‌’ అనే సినిమాలోనిది. నటి షబానా ఆజ్మీ.. దర్శకుడు శేఖర్‌ కపూర్‌. ఈ వారం విఫల ప్రేమ గాథ ఆ ఇద్దరిదే. బ్రేకప్‌ తర్వాత ఆ ఇద్దరి పరిస్థితి ఆ గీతాలాపనే. 

షబానా ఆజ్మీ.. కైఫీ ఆజ్మీ, షౌకత్‌ల కూతురు అని తెలిసిందే. ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ అసోసియేషన్‌ (ఇప్టా), ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ అసోసియేషన్‌కు సారథ్యం వహించడంతోపాటు సినిమా రంగంతోనూ అనుబంధం ఉన్నవారే. షబానాకు నటన వారసత్వంగా అబ్బినా, అవకాశాలను మాత్రం ప్రతిభతోనే అందిపుచ్చుకుంది. అలా 1974లో శ్యామ్‌ బెనగల్‌ దర్శకత్వంలో ‘అంకుర్‌’తో సినిమాల్లోకి వచ్చింది. అదే యేడు ‘ఇష్క్‌ ఇష్క్‌ ఇష్క్‌’లోనూ నటించింది. అందులో ఒక హీరో.. శేఖర్‌ కపూర్‌.
అతను.. చిత్రరంగ ప్రవేశం చేసే ముందు వరకు శేఖర్‌ కపూర్‌ లండన్‌లో చార్టెర్డ్‌ అకౌంటెంట్‌గా ప్రాక్టీస్‌లో ఉన్నాడు. సాహిత్యంలోనూ మంచి పట్టున్నవాడు. వృత్తి కన్నా ప్రవృత్తిని బాగా ప్రేమించేవాడు.

పేరుకే అంకౌట్స్‌ కాని చిత్తమంతా బాంబే సినిమా మీదే ఉంది. శేఖర్‌ కపూర్‌ మనసు అతని మేనమామ దేవానంద్‌కు తెలుసు. మామ నుంచి పిలుపు వచ్చేలోపే బాంబేలో వాలిపోయాడు శేఖర్‌ కపూర్‌. మోడలింగ్‌ మొదలుపెట్టాడు. సినిమాల్లో అవకాశాల పోరాటమూ చేస్తున్నాడు. అప్పుడే దేవానంద్‌ ‘ఇష్క్‌ ఇష్క్‌ ఇష్క్‌’ సినిమా ప్రారంభించాడు. అందులోని మూడు జంటల్లో షబానా, శేఖర్‌ కపూర్‌ను ఒక జతగా ఖాయం చేశాడు. మూవీ సెట్స్‌లో ఆ ఇద్దరి మధ్యా ఇష్క్‌ మొదలైంది. షబానా చురుకుదనం అతణ్ణి ఆకర్షించింది. అతని పరిజ్ఞానం, ఆధునిక ఆలోచనా శైలి ఆమెకు నచ్చాయి. ఆ ఇష్టం..స్నేహంగా మారి  ప్రేమగా బలపడి .. ఇద్దరూ కలిసి ఉండేంతగా స్థిరపడింది. ఆ సహజీవనం మీడియాకు కావల్సినన్ని గాసిప్స్‌నిచ్చింది.

ప్యాకప్‌.. బ్రేకప్‌.. 
కాలం గడుస్తోంది. శేఖర్, షబానా లవ్‌ లైఫ్‌ హ్యాపీగా సాగుతోంది కాని శేఖర్‌ యాక్టింగ్‌ గ్రాఫే ముందుకు సాగట్లేదు. అతను హీరోగా నటించిన ఆరు సినిమాలూ కమర్షియల్‌ ఫ్లాప్‌. ఇటు షబానాకు నటిగా మంచి  గుర్తింపు వచ్చేసింది. కథానాయికగా డిమాండ్‌ కూడా పెరిగింది. ఏం జరిగిందో తెలియదు ఆ ఇద్దరి ఏడేళ్ల ప్రేమ, సాహచర్యానికి బ్రేక్‌ పడింది. ఒకే చూరు కింద ఉంటున్న ఆ జంట వేరుపడింది. అయినా చెలిమిని కొనసాగించారు.  శేఖర్‌ కపూర్‌ నటన నుంచి దర్శకత్వం వైపు రూటు మార్చుకున్నాడు. ‘మాసూమ్‌’ సినిమాతో దర్శకుడిగా మారాడు. అందులో హీరోయిన్‌గా షబానానే తీసుకున్నాడు. అలా వాళ్ల స్నేహం ఇప్పటికీ కొనసాగుతోనే ఉంది.. ఎవరి జీవితాల్లో వాళ్లు సెటిల్‌ అయినా!

దిల్‌ చాహ్‌తా హై
ప్రేమ వైఫల్య విషాదాన్ని మరిచిపోవడానికి సినిమాలతో బిజీ అయిపోయింది షబానా. ఆ టైమ్‌లోనే జావేద్‌ అఖ్తర్‌ ఉర్దూ కవిత్వంలో మరింత పట్టు సాధించడం కోసం షబానా వాళ్ల నాన్న కైఫీ ఆజ్మీ దగ్గరకు వస్తూండేవాడు. తన తండ్రితో జావేద్‌ చేసే సాహిత్య, ఫిలాసఫీ చర్చల్లో ఆమే పాల్గొనేది. ఆమె ఆత్మవిశ్వాసం, అవగాహన, స్పష్టమైన అభిప్రాయ ధోరణి విపరీతంగా నచ్చేశాయి జావెద్‌కు. తన పట్ల అతను ఆసక్తి చూపిస్తున్నాడని షబానాకు అర్థమైనా పట్టించుకోలేదు. కారణం.. అప్పటికే జావేద్‌ వివాహితుడు, ఇద్దరు పిల్లల తండ్రీ కావడమే. కాని జావేద్‌కు అవేవీ అడ్డం కాలేదు షబానా మీద ప్రేమను ప్రకటించడానికి. ప్రకటించి షబానాను ఒప్పించడానికి. ఈ ప్రేమా బాలీవుడ్‌లో గుప్పుమంది. ఆ నాటికే జావేద్‌కు సలీమ్‌తో జంట రచయితగా మంచి పేరు వచ్చింది. షోలే లాంటి హిట్లతో ఫుల్‌ ఫామ్‌లో ఉన్నాడు. 

హనీకి తెలిసి...
జావేద్‌ అఖ్తర్‌ తొలి ప్రేమ హనీ ఇరానీ. ఆమె కూడా నటే. సీతా ఔర్‌ గీతా సమయంలో ఆమెతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక ఇల్లు, పిల్లల (జోయా, ఫర్హాన్‌)తో బిజీ అయిపోయింది హనీ. జావేద్‌ రహస్య ప్రేమ ఆమె దాకా చేరింది.  పెద్దగా వాదులాడలేదు హనీ. పిల్లలు డిస్టర్బ్‌ అవుతారని. వాళ్లకు తండ్రి మీద అయిష్టత ఏర్పడకూడదని. ఈ వ్యవహారం ఇటు షబానా ఇంట్లోనూ తెలిసింది. కైఫీ ఆజ్మీ అభ్యంతరపెట్టాడు. ఇంకో ఆడబిడ్డ కాపురం కూల్చిన నింద  తన కూతురు మీద పడొద్దని. నిజానికి జావేద్‌ జీవితంలోకి షబానా ప్రవేశించే వరకు జావేద్, హనీలది కలతలు లేని కాపురమే. లేమిలో జావేద్‌కు నైతిక అండగా నిలిచింది హనీ. ఆ విషయాలన్నీ కైఫీకి తెలుసు. అందుకే కూతురిని వారించాడు. తన వల్ల జావేద్‌ విడాకులు తీసుకోవట్లేదని తండ్రిని ఒప్పించింది షబానా. విడాకులతో హనీకి అల్విదా చెప్పి నిఖాతో షబానాకు తోడయ్యాడు జావేద్‌. 

‘జావేద్, షబానాల పట్ల నా పిల్లల మనసుల్లో వ్యతిరేకత నాటడం నాకు ఇష్టంలేదు. పిల్లలకు జావేద్‌ దూరం కావద్దని కోరుకున్నానంతే. షబానాను శత్రువుగా చూడలేదు. ఫ్రెండ్‌గానూ దగ్గర కాలేదు. నా పిల్లలకు మాత్రం ఆమె అత్యంత ఆప్తురాలు. వాళ్లు నన్నెలా ప్రేమిస్తారో, గౌరవిస్తారో షబానానూ అంతే ప్రేమిస్తారు. గౌరవిస్తారు’ అని చెప్తుంది హనీ ఇరానీ. 
∙ఎస్సార్

మరిన్ని వార్తలు