Shaadi Mubarak Review: సింపుల్‌ క్యూట్‌ లవ్‌స్టోరీ

6 Mar, 2021 15:17 IST|Sakshi
Rating:  

టైటిల్ ‌: షాదీ ముబారక్‌
నటీనటులు : సాగర్, దృశ్య రఘునాథ్, రాహుల్ రామకృష్ణ, హేమ, రాజశ్రీ నాయర్, బెనర్జీ, అదితి మ్యాకాల్ తదితరులు
దర్శకత్వం : పద్మశ్రీ
నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సంగీతం : సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫి : శ్రీకాంత్ నరోజ్
ఎడిటింగ్ ‌: మధు చింతల
విడుదల తేది : మార్చి 5, 2021

బుల్లితెరపై ఆర్కే నాయుడుగా నటించి కుటుంబ ప్రేక్షకుల అభిమానం చూరగొన్నాడు ‘మొగలిరేకులు’ సీరియల్‌ ఫేం సాగర్‌. గతంలో ప్రభాస్‌ ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ సినిమాతో వెండితెరపై తళుక్కుమన్న అతడు హీరోగా పరిచయం అవుతున్న మూవీ ‘షాదీ ముబారక్‌’. టాలీవుడ్‌ బడా నిర్మాత దిల్‌ రాజు నిర్మించగా, పద్మశ్రీ దర్శకత్వం వహించారు. ఆకట్టకునే టైటిల్‌తో తెరకెక్కిన మూవీ ట్రైలర్‌పై పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ కావడంతోమంచి అంచనాలే ఏర్పడ్డాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంది? హీరోగా సాగర్‌ ఎంత వరకు సక్సెస్‌ అయ్యాడు? అన్న అంశాలు రివ్యూలో గమనిద్దాం.

కథ
మాధవ్ (సాగర్) ఫారిన్‌లో ఉంటాడు. ఆస్ట్రేలియాలో నివసించే అతడు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్‌ అయి, వధువును సెలక్ట్‌ చేసుకునే క్రమంలో హైదరాబాద్ వస్తాడు. అక్కడే ఓ మ్యారేజ్‌ బ్యూరోను ఆశ్రయించి తనకు ఎలాంటి అమ్మాయి కావాలో వివరాలు చెప్తాడు. ఈ క్రమంలో మ్యారేజ్‌ బ్యూరో ఓనర్ కూతురు అయిన తుపాకుల సత్యభామ (దృశ్య రఘునాథ్) పరిచయం అవుతుంది. తన తల్లికి యాక్సిడెంట్ కావడంతో తానే బ్యూరో వ్యవహారాలు చూస్తున్న, ఆమె  మాధవ్‌తో కలిసి సత్యభామ పెళ్లి చూపులకు హాజరవుతూ ఉంటుంది. ఈ ప్రయాణంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న సత్యభామ, మాధవ్ ప్రేమలో పడతారు. మరి వారి ప్రేమ ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి పీటలు ఎక్కిందా? సత్యభామ- మాధవ్‌ ఒక్కటయ్యారా లేదా తెలియాలంటే షాదీ ముబారక్‌ చూడల్సిందే.

నటీనటులు
బుల్లితెరపై మొగలిరేకులు సీరియల్‌లో నటించి లక్షలాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్న సాగర్‌..మంచి కథతో హీరో అయ్యాడు.మాధవ్‌ పాత్రలో ఒదిగిపోయాడు. స్క్రీన్‌పై బాగా కనిపించడమే కాకుండా మంచి ఫెర్ఫార్మెన్స్‌ను ప్రదర్శించాడు. ఇక హీరోయిన్‌ దృశ్య రఘునాథ్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అలరించింది.రాహుల్ రామకృష్ణ, హేమంత్, భద్రం తమదైన కామెడీతో నవ్వించారు. హేమ, రాజశ్రీ నాయర్, బెనర్జీ, అదితి మ్యాకాల్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. 

విశ్లేషణ
దర్శకుడు పద్మశ్రీకి తొలి సినిమా ఇది. కానీ ఎన్నో సినిమాలు తీసిన అనుభవం ఉన్నట్లుగా కథను తెరకెక్కించాడు. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని సాధించాడని చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్‌లో ఓ అందమైన కథను ప్రేక్షకులకు అందించాడు. యువతను అకర్షించే అంశాలైన రొమాన్స్‌, కామెడీని తన కథలో మిస్‌ కాకుండా చూసుకున్నాడు. ప్రేక్షకుడికి బోర్‌ కొట్టకుండా సింపుల్‌ కథని చక్కగా తెరపై చూపించాడు. స్క్రీన్‌ప్లే బాగుంది. ఇక ఈ సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌ సునీల్ కశ్యప్  సంగీతం. పాటలతో  పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. మధు చింతల ఎడిటింగ్‌, శ్రీకాంత్ నరోజ్ సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు