షారుక్‌ ట్వీట్‌ వైరల్‌: లేటైనా నో ప్రాబ్లం.. వచ్చేటప్పుడు గోల్డ్‌తో రండి

2 Aug, 2021 16:55 IST|Sakshi

టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్భుతమే చేసింది. క్వార్టర్స్‌లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను కట్టడి చేసి సెమీ ఫైనల్‌కు చేరి సత్తా చాటింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌ తర్వాత భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఒలింపిక్స్‌లో తొలిసారిగా సెమీస్‌ చేరింది. తాజాగా ఈ విజయంపై బాలీవుడ్ బాద్ షా షారుక్‌ఖాన్ తనదైన శైలిలో స్పందించాడు. 

అంచనాలను తారుమారు చేస్తూ భారత మహిళల హాకీ జట్టు సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో మహిళల జట్టుపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. చారిత్రాత్మక సంద‌ర్భాన్ని కోచ్ సోయెర్డ్‌ మ‌రీన్‌ రియ‌ల్ లైఫ్ చ‌క్ దే ఇండియాతో పోల్చాడు. ఎందుకంటే ఆ సినిమా కూడా మ‌హిళ‌ల హాకీ కథాంశంతోనే తెర‌కెక్కింది కనుక. ఈ ఆనందాన్నీ కోచ్‌ సోషల్‌మీడియాలో పంచుకుంటూ.. సారీ ఫ్యామిలీ.. నేను రావ‌డం ఆలస్యమవుతుందని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ చిత్రంలో కోచ్‌ క‌బీర్‌ఖాన్ పాత్ర పోషించిన షారుక్ దీనికి స్పందిస్తూ.. స‌రే ఏం ప్రాబ్లం లేదు. మీరు వ‌చ్చేట‌ప్పుడు భారత్‌లోని లక్షల కుటుంబాల కోసం గోల్డ్ తీసుకురండి చాలు.. మీ మాజీ కోచ్ క‌బీర్ ఖాన్ అని రిప్లై ఇచ్చాడు.

కాగా ఉత‍్కంఠ సాగుతున్న మ్యాచ్‌లో గుర్‌జీత్ సంచలన గోల్ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించింది. ఆస్ట్రేలియా ఒక్క గోల్ కూడా సాధించలేదు. దీంతో భారత మహిళల హాకీ జట్టు తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. అటు 49 ఏళ్ల తర్వాత తొలిసారి పురుషుల హాకీ జట్టు కూడా సెమీ ఫైనల్స్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు