షారుఖ్‌ ‘మన్నత్’‌ను అమ్మేస్తున్నాడా?!

28 Oct, 2020 09:01 IST|Sakshi

నెటిజన్‌ ప్రశ్నకు షారుఖ్‌ చమత్కారం

ముంబై: బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌కు అభిమానులతో ముచ్చటించడమంటే మహా సరదా. ఇక అభిమానుల చిలిపి ప్రశ్నలకు షారుఖ్‌ ఇచ్చే సమాధానాలు కూడా అంతే చిలిపిగా, చమత్కారంగా ఉంటాయి. తాజాగా ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాడు కింగ్‌ ఖాన్‌. ‘ఆస్క్‌ ఎస్‌ఆర్‌కే’ పేరిట మంగళవారం ఫ్యాన్స్‌తో చాటింగ్‌ చేస్తున్న సందర్భంగా ఓ నెటిజన్‌.. షారుఖ్‌ నివాసం ‘మన్నత్‌’గురించి ఓ ప్రశ్న అడిగాడు. ‘‘భాయ్‌ మన్నత్‌ను అమ్మేస్తున్నారా ఏంటి?’’ అంటూ సందేహం వ్యక్తం చేశాడు. ఇందుకు బదులుగా.. ‘‘మన్నత్‌ను ఎప్పుడూ ఎవరూ అమ్మలేరు.. ఇస్తారు.. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకున్నట్లయితే జీవితంలో అనుకున్నవని సాధిచంగలుగుతావు’’అని చమత్కరించాడు.

కాగా మన్నత్‌ అంటే వాగ్దానం(మాట ఇవ్వడం) అనే అర్థంలో ఈ విధంగా స్పందించాడు. ఇక షారుఖ్‌ సమయస్ఫూర్తికి నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. షారుఖ్‌ సన్నిహితుడు, దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌.. హార్ట్‌ ఎమోజీలతో స్పందన తెలియజేశాడు. కాగా షారూఖ్‌ ఖాన్‌కు ఉన్న స్థిరాస్తుల్లో అత్యంత విలువైనది అతడి ఇల్లే. ‘మన్నత్‌’గా పేరొందిన విలాసవంతమైన ఆ బంగ్లా ఖరీదు దాదాపు రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా.(చదవండి: స్టోరీ: 25 ఏళ్ల దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే)

గౌరీ, నేను చిన్న ఇంట్లో ఉండేవాళ్లం
ముంబైలో, సముద్ర తీరాన ఎంతో ఆహ్లాద వాతావరణాన్ని కలిగి ఉండే ఈ బంగ్లాలో షారుఖ్‌ కుటుంబం నివాసం ఉంటోంది. ఇక మన్నత్‌ను కొనుక్కోవడం గురించి షారూఖ్‌ గతంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..‘‘ నేను ఢిల్లీ నుంచి వచ్చాను. ఢిల్లీ వాళ్లకు బంగ్లాలో ఉండటమే ఇష్టం. కానీ ముంబైలో అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ ఉంటుంది. అందుకే సొంత ఇల్లు కొనాలని భావించాను. మొదట నా భార్య గౌరీతో కలిసి చిన్న ఇంట్లో ఉండేవాడిని. కొన్నేళ్ల తర్వాత మన్నత్‌ గురించి తెలుసుకుని.. దానిని సొంతం చేసుకున్నాను. నా జీవితంలో నేను కొన్న అత్యంత ఖరీదైన భవనం అదే’’ అని చెప్పుకొచ్చాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు