Shahid Kapoor: మాపై దయ చూపించలేదు, గుండె ముక్కలైంది..

1 Mar, 2023 15:58 IST|Sakshi

ఒక భాషలో ఏదైనా సినిమా హిట్టయిందంటే చాలు దాన్ని వేరే భాషలో రీమేక్‌ చేయాలని తహతహలాడిపోతుంటారు సినీతారలు. ఈ క్రమంలో కొన్నిసార్లు సూపర్‌ హిట్లు తీసినా మరికొన్నిసార్లు మాత్రం చేతులు కాల్చుకుంటారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌ ఇలా రీమేక్‌లు తీసి వరుస ఫ్లాపులు మూటగట్టుకుంటోంది. సౌత్‌లో హిట్‌ అయిన చిత్రాలను హిందీలో రీమేక్‌ చేసి వదులుతోంది. కానీ ఎందుకో అక్కడ అస్సలు వర్కవుట్‌ కావడం లేదు. అయినా సరే పట్టు వదలకుండా రీమేక్‌లు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో విక్రమ్‌ వేద, హిట్‌, జెర్సీ, షెహజాదా (అల వైకుంఠపురములో), డ్రైవింగ్‌ లైసెన్స్‌(సెల్ఫీ) వంటి చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి.

అయినా సరే వాటిని లెక్క చేయకుండా బోలెడన్ని సినిమాలు ఇంకా క్యూలో ఉన్నాయి. లవ్‌ టుడే, సూరరై పోట్రు, ఎఫ్‌ 2, బ్రోచెవారెవరురా, ఖైదీ, కత్తి, అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌.. ఇలా చాలా చిత్రాలు రీమేక్‌ బాటపట్టాయి. హిందీ ప్రేక్షకులు సౌత్‌ కంటెంట్‌ను ఇష్టపడటం లేదని కాదు.. దక్షిణాది సినిమాలను చూస్తున్నారు, ఒరిజినల్‌ కంటెంట్‌ను మాత్రమే ఇష్టపడుతున్నారు.. రీమేక్‌లకు మాత్రం నిర్మొహమాటంగా నో చెప్తున్నారు. అయితే మంచి కంటెంట్‌ ఉన్న సినిమాను వ్యతిరేకిస్తే తట్టుకోలేమంటున్నాడు బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌.

నాని హీరోగా నటించిన జెర్సీ మూవీకి తెలుగులో విశేష స్పందన లభించింది. ఈ సినిమా హిందీ రీమేక్‌లో షాహిద్‌ కపూర్‌ హీరోగా నటించాడు. కోవిడ్‌ కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం గతేడాది ఏప్రిల్‌లో రిలీజవగా ఘోర పరాజయం పొందింది. దీనిపై షాహిద్‌ మాట్లాడుతూ.. 'నా గుండె పగిలినట్లైంది. ఎంతో మంచి సినిమా అది, కానీ ఈ ప్రపంచం మాపై దయచూపలేదనుకుంటా.. పాటలు విడుదలైన మరో నాలుగు నెలలకు సినిమా రిలీజైంది.

జెర్సీతో ఓ విషయం నాకు బాగా అర్థమైంది. సినిమాలు ఫాస్ట్‌ఫుడ్‌ వంటివి. అది వేడివేడిగా ఉన్నప్పుడే వెంటనే తినేయాలి.. దాన్ని వాయిదాలు వేసుకుంటూ ఆలస్యం చేస్తే అంత మజా రాదు. అప్పుడు కరోనా టైంలో సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్లాలో కూడా అర్థం కాలేదు. దురదృష్టవశాత్తూ సినిమా ఫ్లాప్‌ అయింది' అని చెప్పుకొచ్చాడు. తాజాగా ఫర్జీ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చాడు షాహిద్‌ కపూర్‌. ఫిబ్రవరి 10 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న ఈ సిరీస్‌కు మంచి ఆదరణ లభించింది.

మరిన్ని వార్తలు