నా డిజిటల్‌ ఎంట్రీ గురించి భయంగా ఉంది: షాహిద్‌ కపూర్‌

22 Jun, 2021 16:16 IST|Sakshi

బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ త్వరలో తన డిజిటల్‌ ఎంట్రీకి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌ డైరెక్టర్స్‌ రాజ్ అండ్‌ డీకేలతో కలిసి ఓ వెబ్‌ సిరీస్‌ చేయబోతున్నాడు. ఇదిలా ఉండగా సోమవారంతో షాహిద్‌ ‘కబీర్‌ సింగ్‌’ మూవీ రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ సెషన్‌ నిర్వహించాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలో డిజిటల్‌ ఎంట్రీపై స్పందించాడు. ఓ అభిమాని తన ఓటీటీ ఎంట్రీపై  ప్రశ్నించగా.. రాజ్‌, డీకేలతో కలిసి ఓ వెబ్‌ సిరీస్‌ కోసం పనిచేయడం సంతోషంగా ఉన్నా అదే సమయంలో చాలా భయంగా కూడా ఉందంటూ సమాధానం ఇచ్చి షాహిద్‌ ఆశ్చర్యపరిచాడు.

‘నిజంగా నా డిజిటల్‌ ఎంట్రీపై భయపడుతున్న. ఎందుకంటే బిగ్‌ స్క్రీన్‌పై ప్రేక్షకుల ప్రేమ, అభిమానాన్ని అందుకున్న ప్రతి నటీనటులంతా ఓటీటీలో వారి ప్రశంసలు అందుకోవచ్చు లేదా అందుకోకపోవచ్చు అనేది నా అభిప్రాయం. అలాగే సినిమాల్లో వచ్చిన సక్సెస్‌ ఓటీటీలో రాకపోవచ్చు. సినిమాలకు అక్కడ ఆదరణ ఉంటుందన్న గ్యారంటీ లేదు’ అంటూ వివరణ ఇచ్చాడు. కాగా రాజ్‌, డీకే దర్శకత్వంలో వస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌తో షాహిద్‌ కపూర్‌ ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్నట్లు గతంలో మేకర్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.  దీంతో షాహిద్‌ ‘ఆమెజాన్‌ ప్రైంలో తనకు ఇష్టమైన ఇండియన్‌ షో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌’. అదే సిరీస్‌ డైరెక్టర్స్‌తో  నా డిజిటల్‌ ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. వారు నాకు కథ వివరించగానే నాకు నచ్చి ఒకే చెప్పాను. ఆ కథతో త్వరలోనే మీ ముందుకు వస్తున్నాను. అప్పటి వరకు వేచి ఉండలేక పోతున్న అంటూ  రాజ్‌, డీకేలతో కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు