రోడ్డుపై కుప్పలుకుప్పలుగా రూ.2 వేల నోట్లు.. షాహిద్‌ కపూర్‌పై నెటిజన్స్‌ ఫైర్‌

6 Oct, 2021 14:21 IST|Sakshi

రోడ్డుపై డబ్బులు కనిపిస్తే ఎవరైనా ఊరుకుంటారా? టక్కున వెళ్లి గమ్మున జేబులో వేసుకొని వెళ్లిపోతారు. అలాంటిది రోడ్డుపై కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు.. అది కూడా రూ.2000 నోట్ల కట్టలు పడి ఉంటే..? ఎవరు ఊరుకుంటారు? అంతా పరుగెత్తుకొచ్చి ఆ నోట్లను ఏరుకునే పనిని మొదలు పెడతారు. సరిగ్గా ఇలాంటి సంఘటననే ముంబైలోని ఓ ప్రాంతంలో జరిగింది. రోడ్డుపై కుప్పలుకుప్పలుగా రూ.2 వేల నోట్లు పడి ఉండడంతో.. వాటిని ఏరుకోవడానికి స్థానికులు ఎగబడ్డారు. తీరా అవన్ని నకిలీ నోట్లు అని తెలియడంతో నిరాశతో వెనుదిరిగారు. కొంతమంది మాత్రం బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌పై ఫైర్‌ అయ్యారు.
(చదవండి: సోనుసూద్‌ ట్వీట్‌, మండిపడుతున్న నెటిజన్లు)

నోట్ల కట్టలకు షాహిద్‌కు సంబంధం ఏంటనేగా మీ అనుమానం? ఆ నకిలీ డబ్బంతా షాహిద్‌ కపూర్‌ నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘సన్నీ’షూటింగ్‌ కోసం ఉపయోగించినదే. ‘ఫ్యామిలీ మేన్‌’సిరీస్‌ తర్వాత రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక వెబ్‌ సిరీస్‌ ‘సన్నీ’.ఈ సిరీస్‌లో హీరోగా షాహిద్‌ కపూర్‌ నటించగా,  విజయ్‌ సేతుపతి, రాశీ ఖన్నా, రెజీనా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 
(చదవండి: అన్ని భయాలను జయించా.. తన అరుదైన వ్యాధి గురించి నటి వెల్లడి)

 ఈ సిరీస్‌ షూటింగ్‌లో భాగంగా ఓ యాక్సిడెంట్‌ సన్నివేశం ఉంది. ఆ సమయంలో రూ. 2 వేల నోట్లు రోడ్డుపై పడిపోవాలి. దీని కోసం నకిలీ నోట్లను ఉపయోగించింది చిత్ర యూనిట్‌. కానీ షూటింగ్‌ అయిపోయాక వాటిని తీసేయడం మర్చిపోయారు. దీంతో ఆ ప్రాంతంలోకి కొంతమంది అవి నిజమైన డబ్బులే అనుకొని ఏరుకునేందుకు ఎగబడ్డారు. తర్వాత అసలు విషయం తెలుసుకొని నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయంపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీ మహాత్ముడు ఫొటో ఉన్న నోట్లను రోడ్డుపై పారేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. షూటింగ్‌కి చిత్రబృందం అనుమతి తీసుకుందని, అయితే గాంధీజీకి అవమానం జరిగిందనే విషయంపై విచారణ చేస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. చిత్ర యూనిట్‌ మాత్రం తాము వినియోగించిన నకిలీ నోట్లను అక్కడ నుంచి తొలగించామని, ఇప్పుడున్న నోట్లు ఎలా వచ్చాయో తెలియదని చెప్పినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు