బాత్రూమ్‌లో కాదు ఆరుబయట స్నానం చేయడం ఇష్టం : స్టార్‌ హీరోయిన్‌

5 Jun, 2022 11:08 IST|Sakshi

సెలబ్రిటీల వింత అలవాట్లు

జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అన్నారు పెద్దలు. ఆ బుద్ధిలోనే మనిషికో అలవాటునూ కలిపేసుకోవచ్చు. సామాన్యుల అలవాట్లు, ప్రవర్తన ఎంత అసామాన్యంగా ఉన్నా ప్రాచుర్యంలోకి రావు. అసామాన్యులు లేదా పదిమందికీ తెలిసిన ప్రముఖుల అలవాట్లు ఎంత సామాన్యమైనవైనా ఇట్టే ప్రచారమవుతాయి. అలా వైరలైన కొందరు సెలబ్రిటీల వింత అలవాట్లు తెలుసుకుందాం.. సరదాగా!

ఎంతిష్టమైతే మాత్రం.. 
చెప్పులంటే ఎంతిష్టమైతే మాత్రం నెత్తి మీద పెట్టుకుంటామా!? కానీ బాలీవుడ్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ అలాగే చేస్తాడు ఇంచుమించుగా! అంటే .. తల మీద పెట్టుకోడు అలాగని చెప్పుల స్టాండ్‌లోనూ పెట్టడు. షారుఖ్‌కి షూస్‌ అంటే చాలా చాలా ఇష్టమట. అందుకే ఇరవై నాలుగ్గంటలూ ఇంటాబయటా షూస్‌ వేసుకునే ఉంటాడు. రాత్రి కూడా చాలాసార్లు షూస్‌తోనే నిద్రపోతాడట.

ఏమయ్యా క్రూజూ.. ఏంటయ్యా అది?
వ్వాక్‌.. ఎంత సౌందర్య పోషణయితే మాత్రం ఆ పనేంటండీ బాబూ.. ! ఏం చేశాడేంటి ఆ అమెరికన్‌ యాక్టర్‌ టామ్‌ క్రూజ్‌.. అంతమాటనేసినారు? తన ముఖారవింద చర్మ సంరక్షణ కోసం రోజూ నైటింగేల్‌ పిట్ట (కోకిల) రెట్టనింత తీసుకుని  ఫేషియల్‌ క్రీమ్‌లా మొహానికి పూసుకుంటాడట!! అవాక్కయ్యారా! అది మరి మ్యాటర్‌... అట్లుంది వీళ్లలోని!

అన్నింట్లోకి.... పెరుగు ఉండాల్సిందే ఆలియా భట్‌కు. ఉండొచ్చు .. పరోటా.. ఉప్మా.. పోహా.. ఆఖరుకు చపాతీకీ పెరుగు కాంబినేషన్‌ బాగానే ఉంటుంది. కానీ ఆలియాకు చైనీస్‌.. ఇటాలియన్‌.. మెక్సికన్‌.. ఇలా ఏ దేశపు వంటకానికైనా తోడు కూడా పెరుగు లేకపోతే ముద్ద దిగదట. ఆలియా పెరుగు పిచ్చి చూసి తోటివాళ్లంతా నవ్వుకుంటారట. నవ్విపోదురు గాక.. నాకేటి.. ప్లేట్‌లో పెరుగుంటే చాలు అనుకుంటూ వేళ్లకంటిన పెరుగును చప్పరించేస్తుందట. 

గుడ్లప్పగించి...
సెలబ్రిటీలనెవరైనా గుడ్లప్పగించి చూస్తే బౌన్సర్లు వచ్చి కనుగుడ్లు పీకేసినా పీకేస్తారు. మరి సెలబ్రిటీలే అలా చూస్తే..! ఆ బుద్ధి ఉన్నది ఎవరికి?అని అడిగితే దీపికా పడుకోణ్‌ అని చెప్పాలి మరి. అవును.. ఎయిర్‌ పోర్ట్స్‌లో.. షాపింగ్‌ మాల్స్‌లో.. ఇలా పబ్లిక్‌ ప్లేసెస్‌లో ఎక్కడైనా కొత్తవాళ్లను కన్నార్పకుండా చూస్తుందట. ఆమెకున్న ఈ అలవాటు తెలియక ఆ స్ట్రేంజర్స్‌ జడుసుకుని వడివడిగా అక్కడి నుంచి వెళ్లిపోతారట. పాఫం..!

ఆరుబయట...
సొంత ఇల్లయినా.. అద్దె ఇల్లయినా సౌకర్యాలకు సంబంధించి రాజీ పడని అంశం.. బాత్రూమ్‌. మాజీ మిస్‌ యూనివర్స్‌.. బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌ కూడా అంతే. అసలు కాంప్రమైజ్‌ కాదు.. బాత్రూమ్‌లో స్నానం చేయని విషయంలో! మీరు చదువుతున్నది కరెక్టే.. ఆమెకు మేడ మీద.. ఆరుబయట స్నానం చేయడం ఇష్టం.. కంఫర్ట్‌ కూడా! అందులో రాజీ సమస్యే లేదు అంటుంది. ఈ గుట్టు చెప్పాం కదా అని ఆమె ఇంటి చుట్టూ ఉన్న మేడల మెట్లెక్కేయకండి! ఆ జాగ్రత్త ఆమెకు తెలుసు.

మరిన్ని వార్తలు