వరుస వివాదాల్లో డైరెక్టర్‌ శంకర్‌‌

16 Apr, 2021 06:36 IST|Sakshi

వరుస వివాదాలతో దర్శకుడు శంకర్‌ అల్లాడిపోతున్నారు. హీరో రామ్‌చరణ్‌తో శంకర్‌ సినిమాను అనౌన్స్‌ చేయగానే ‘కమలహాసన్‌తో తాము నిర్మిస్తున్న ‘ఇండియన్‌ 2’ సినిమాను పూర్తి చేయనిదే ఎక్కడికీ కదలడానికి లేదు’ అని  లైకా ప్రొడక్షన్స్‌ కేసు నమోదు చేసింది. ఇది ఇలా ఉండగా, తమిళ చిత్రం ‘అన్నియన్‌’ (తెలుగులో ‘అపరిచితుడు’) హిందీ రీమేక్‌ను హీరో రణ్‌వీర్‌సింగ్‌తో చేయనున్నట్టు బుధవారం నాడు శంకర్‌ ప్రకటించడం మరో సంచలనమైంది. ఇప్పుడు ఆ ప్రకటన కూడా వివాదాస్పదమైంది. శంకర్‌ ప్రకటించి 24 గంటలు గడవకముందే అప్పట్లో ‘అన్నియన్‌’ చిత్రాన్ని నిర్మించిన ‘ఆస్కార్‌’ రవిచంద్రన్‌ ఆ కథ హక్కులు తనవి అంటూ ఘాటుగా లేఖ పంపారు. ఆ వెంటనే శంకర్‌ దానికి తన స్పందనగా మరో ఘాటైన ప్రత్యుత్తరం ఇచ్చారు. ఈ వివాదం సినీసీమలో గురువారం పెద్ద చర్చనీయాంశమైంది.

నన్నడగకుండా ఎలా తీస్తారు? – ‘అన్నియన్‌’ నిర్మాత రవిచంద్రన్‌
‘నా ఊహలకు తగ్గట్టు పవర్‌ఫుల్‌ హీరో దొరికాడు. హిందీలో నా ‘అన్నియన్‌ ’ అతనే’ అని దర్శకుడు శంకర్‌ ఇలా ప్రకటించారో, లేదో అలా వివాదం మొదలైంది. ‘‘నన్ను సంప్రదించకుండానే రీమేక్‌ని ప్రకటిస్తారా?’ అంటూ ‘అన్నియన్‌ ’ చిత్ర నిర్మాత ‘ఆస్కార్‌’ వి. రవిచంద్రన్‌  మండిపడ్డారు. దర్శకుడు శంకర్‌ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఓ లేఖను కూడా విడుదల చేశారు. ఆ లేఖ సారాంశం ఏమిటంటే... ‘‘మీరు (శంకర్‌) ‘అన్నియన్‌ ’ ఆధారంగా హిందీలో ఓ సినిమాను అనౌన్స్‌ చేయడం తెలిసి, షాక్‌ అయ్యాను. ‘అన్నియన్‌ ’కు నేను నిర్మాతని అని మీకు గుర్తుండే ఉంటుంది.

ఈ స్టోరీ లైన్‌ పై పూర్తి స్థాయి హక్కులను రచయిత సుజాత (దివంగత రచయిత సుజాతా రంగరాజన్‌ )కు డబ్బు చెల్లించి నేను సొంతం చేసుకున్నాను. ఇందుకు ఆధారాలు కూడా నా వద్ద భద్రంగా ఉన్నాయి. ‘అన్నియన్‌ ’ స్టోరీలైన్‌ కు సంబంధించిన పూర్తి హక్కులు నావే.  నా అనుమతి లేకుండా ఈ స్టోరీలైన్‌ తో రీమేక్‌ సినిమా చేయాలనుకోవడం చట్టరీత్యా నేరం. మీ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్‌’ సక్సెస్‌ కాకపోవడంతో ఆందోళనలో ఉన్న మీకు ‘అన్నియన్‌ ’కు దర్శకుడిగా అవకాశం ఇచ్చింది నేనే.

ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌ దర్శకుడిగా మీ స్టార్‌డమ్‌ను పెంచింది. ఇందులో ‘అన్నియన్‌ ’ నిర్మాతగా నా సపోర్ట్‌ ఉంది. కానీ ఇదంతా  మరచిపోయి నన్ను సంప్రదించకుండానే మీరు హిందీ రీమేక్‌ను అనౌన్స్‌ చేశారు. ఎప్పుడూ నైతిక విలువలను పాటించే మీరు, మీ స్థాయిని తగ్గించుకునేలా ఇలా చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడడం నన్ను ఆశ్చర్యపరిచింది. ‘అన్నియన్‌ ’ హక్కులు నా దగ్గర ఉన్నాయి గనుక, హిందీ రీమేక్‌ ఆలోచనను విరమించుకోవాలని సలహా ఇస్తున్నా’’ అని పేర్కొన్నారు రవిచంద్రన్‌ .

కథ... స్క్రీన్‌  ప్లే...డెరెక్షన్‌  నావి! – దర్శకుడు శంకర్‌
‘అన్నియన్‌ ’ హక్కులు తనవేనంటూ ఓ బహిరంగ లేఖ విడుదల చేసిన నిర్మాత రవిచంద్రన్‌ కు దర్శకుడు శంకర్‌ కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. ‘‘ఆ ‘అన్నియన్‌ ’ కథ హక్కులు మీవి (రవిచంద్రన్‌) అంటూ... పంపిన మెయిల్‌ చూసి షాక్‌ అయ్యాను. కథ, స్క్రీన్‌  ప్లే అండ్‌ డైరెక్షన్‌  బై శంకర్‌ అనే టైటిల్‌తోనే ఆ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్, స్క్రీన్‌  ప్లేను నేను ఎవరికి అప్పగించ లేదు. ఆ స్క్రిప్ట్‌ నిజానికి రచయిత సుజాత గారిదని మీరు అనడం నన్ను ఆశ్చర్యపరిచింది.

ఆయన ఆ సినిమాకు డైలాగ్స్‌ మాత్రమే రాశారు. అందుకే, ఆయనకు సినిమాలో డైలాగ్‌ రైటర్‌గా క్రెడిట్‌ ఇవ్వడం జరిగింది. డైలాగ్స్‌ మినహా... ‘అన్నియన్‌ ’ స్క్రిప్ట్, స్క్రీన్‌  ప్లే, హీరో క్యారెక్టరైజేషన్‌  ఇలా దేనిలోనూ సుజాత గారి ప్రమేయం లేదు. ‘అన్నియన్‌ ’కు దర్శకుడిగా నాకే కాదు. నిర్మాతగా మీకూ పేరు వచ్చింది. నిర్మాతగా సినిమా స్క్రిప్ట్‌పై మీకు హక్కు లేదు. నిరాధారమైన ఆరోపణలను ఇకనైనా మానుకోండి. మీరు చెబుతున్న అవాస్తవాలు నా భవిష్యత్‌ ప్రాజెక్ట్స్‌ను ప్రభావితం చేయవు. నా వివరణ మీకు పాజిటివ్‌గానే అర్థం అవుతుందని అనుకుంటున్నా’’ అని పేర్కొన్నారు శంకర్‌.

 

కమల్‌ వస్తే... శంకర్‌ రెడీనే!
‘అన్నియన్‌’ వివాదం ఇలా ఉండగా... ‘ఇండియన్‌  2’ను పూర్తి చేయకుండా, శంకర్‌ మరో సినిమాను డైరెక్షన్‌  చేయకూడదని కోరుతూ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ మద్రాస్‌ హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బుధవారం విచారణ జరిగింది. శంకర్‌ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదిస్తూ, ‘‘లైకా ప్రొడక్షన్స్‌ ప్రతినిధులు ఆరోపించినట్లు ‘ఇండియన్‌  2’ను శంకర్‌ మధ్యలో వదిలేయలేదు. ఆ సినిమా షూటింగ్‌కు విదేశీ సాంకేతిక నిపుణులు కావాలి. ఇప్పుడున్న కోవిడ్‌ పరిస్థితులకు అనుగుణంగా ఫారిన్‌  టెక్నీషియన్స్‌తో షూటింగ్‌ మళ్ళీ మొదలుపెట్టడం అంత ఈజీ కాదు. ఇండియాలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న పెద్ద డైరెక్టర్లలో ఒకరైన శంకర్‌ను రెండేళ్ళుగా ఓ ప్రొడక్షన్‌  హౌస్‌ ఖాళీగా ఉంచడం కరెక్ట్‌ కాదు.

జూన్‌లో కూతురి పెళ్ళి పెట్టుకున్నప్పటికీ, కమల్‌హాసన్‌  గనక షూటింగ్‌కు వస్తే ‘ఇండియన్‌  2’ను పూర్తి చేయడానికి శంకర్‌ సిద్ధంగానే ఉన్నారు’’ అని కోర్టుకు విన్నవించుకున్నట్లు కోడంబాకమ్‌ సమాచారం. కమల్‌హాసన్‌  హీరోగా శంకర్‌ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘ఇండియన్‌ ’. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్‌  2’ను అనౌన్స్‌ చేశారు శంకర్‌. తొలిపార్టులో హీరోగా నటించిన కమల్‌హాసనే మలిపార్టులో కూడా హీరోగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ ఆ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరగడం, కమల్‌ హాసన్‌  మొన్నటివరకు రాజకీయంగా బిజీగా ఉండటంతో ఇప్పటికే 60 శాతం దాకా పూర్తయిన ‘ఇండియన్‌  2’కు బ్రేక్‌ పడింది.

మరిన్ని వార్తలు