ముప్పై ఏళ్లు అవే డైలాగులు

3 Jan, 2021 15:03 IST|Sakshi

ప్రతి ఒక్కరికి ఓ రోజు వస్తుందంటారు. మధ్యప్రదేశ్‌లోని పేద కుటుంబం నుంచి వచ్చిన శరత్‌ సక్సేనాకు కూడా సినిమాల్లోకి వెళ్లే ఓ రోజు వచ్చింది. కానీ గుర్తింపు రావడానికే 30 ఏళ్లు పట్టింది. నటనలో ఓనమాలు నేర్చుకోవడానికి ఇంత కాలం పట్టలేదు. కేవలం దర్శకనిర్మాతలు ఆయనను పట్టించుకోవడానికి ఇంత గడువు పట్టింది. తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను శరత్‌ సక్సేనా.. సీఐఎన్‌టీఏఏ(సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా బయటపెట్టారు. అందరి మనసులను మెలివేస్తున్న 2018నాటి ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఆయన ఇంటర్వ్యూలో ఏమన్నారో చదివేయండి..

సారీ బాస్‌, ఎస్‌ బాస్‌.. ఇవే డైలాగులు
"నా భారీకాయం చూసి దర్శకులెవ్వరూ నన్ను నటుడిగా లెక్కలోకి తీసుకోలేదు. ఎప్పుడూ ఫైటర్‌, జూనియర్‌ ఆర్టిస్ట్‌ పాత్రలే ఇచ్చేవారు. అంతదాకా ఎందుకు.. ఎవరికైనా కండలు తిరిగి బాడీ బిల్డర్‌లా కనిపిస్తే వారిని ఈ దేశంలో లేబర్‌ క్లాస్‌ కింద పరిగణించేవాళ్లు. వాళ్లు దేనికీ పనికి రారన్నట్లుగా చూసేవాళ్లు. విలన్‌ అని ముద్ర వేస్తారు. అయితే మా నాన్న అథ్లెట్‌ కావడం వల్ల మేము కూడా ఆయన నుంచి స్ఫూర్తి పొంది శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకున్నాం. కానీ నన్ను అలా చూసిన దర్శకనిర్మాతలకు నాలో నటుడు కనిపించలేదు. కేవలం జూనియర్‌ ఆర్టిస్ట్‌ కనిపించాడు. అలా ముప్పై ఏళ్లు కేవలం ఫైట్‌ సీన్లలోనే నటించాను. ఎస్‌ బాస్‌, నో బాస్‌, వెరీ సారీ బాస్‌, నన్ను క్షమించండి బాస్‌.. ఈ డైలాగులు మాత్రమే వల్లించేవాడిని. ఆ తర్వాత కొన్నేళ్లకు డైరెక్టర్‌ షాద్‌ అలీ నన్ను గుర్తించి "సాథియా"లో హీరోయిన్‌ తండ్రి పాత్ర ఇచ్చారు. అది చిన్న పాత్రే అయినప్పటికీ జనాలు నన్ను ఇష్టపడ్డారు. ఈ సినిమా నుంచి నేను ఫైటర్‌గా కాకుండా నటుడిగా మారాను. కానీ ఈ మార్పుకు ముప్పై ఏళ్లు పట్టింది" అని కెరీర్‌ తొలినాళ్లనాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. (చదవండి: చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపిన 2020)

జీరో నుంచి ప్రముఖుడిగా మారారు..
ఇంజనీరింగ్‌ పూర్తి చేసుకున్న శరత్‌కు నటుడవ్వాలనేది కల. అలా ముంబైలో అడుగు పెట్టిన ఆయనను డైరెక్టర్లు నెగెటివ్‌ పాత్రలో ఊహించుకున్నారు. ఫలితంగా ఏళ్ల తరబడి విలన్‌కు సలాం చేసే గ్యాంగ్‌ సభ్యుడిగా స్థిరపడిపోయారు. దశాబ్ధాల కాలం తర్వాత సాథియా, బాఘ్‌బాన్‌ వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. తెలుగులోనూ పలు సినిమాల్లో విలన్‌ పాత్రలు పోషించి మెప్పిస్తూ ప్రముఖ నటుడిగా మారిపోయారు. ఇక ఆయనకు అవకాశాలు ఇవ్వకుండా చిన్నచూపు చూడటాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. శరత్‌ అద్భుతమైన నటుడని, అతడికి ప్రతిభకు తగ్గ పాత్ర ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు. అతడికి వివక్ష జరగడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: భర్తను ఎత్తుకున్న నటి.. ఫోటో వైరల్‌)

మరిన్ని వార్తలు