Sharwanand: చాన్స్‌ వస్తే ఆ రోజులకి వెళ్లిపోతా!

18 Sep, 2022 06:33 IST|Sakshi

‘‘ఆడని ఓ సినిమాను హిట్‌ అని ప్రేక్షకులను, విమర్శకులను మభ్య పెట్టలేం. ఫెయిల్యూర్‌ని ఒప్పుకోవాలి. ఎందుకంటే అది నిజం కాబట్టి. ఇది నేను నా గురించి మాత్రమే చెబుతున్నాను’’ అన్నారు శర్వానంద్‌. శ్రీ కార్తీక్‌ దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజైంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో శర్వానంద్‌ చెప్పిన విశేషాలు...

► టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో ‘ఒకే ఒక జీవితం’ అన్నప్పుడు రిస్క్, ఆడియన్స్‌ ఎలా రిసీవ్‌ చేసు కుంటారు? అనేకన్నా కూడా విమర్శకులు ఎలా స్పందిస్తారోననే భయం ఉండేది. విమర్శకులు కూడా మా సినిమాను యాక్సెప్ట్‌ చేసినందుకు హ్యాపీగా ఉంది. మేము ఊహించినట్లే ఈ సినిమాకు అందరూ కనెక్ట్‌ అవుతుండటంతో ఓ బరువు దిగిపోయిందనే ఫీలింగ్‌ కలిగింది. ఇక టైమ్‌ మిషన్‌తో నాకు అవకాశం వస్తే నా ఇంటర్‌ కాలేజ్‌ డేస్‌కి వెళతా. కాలేజ్‌ లైఫ్‌ బెస్ట్‌. ఎందుకంటే రేపటి గురించి ఆలోచన, నిన్నటి గురించిన బాధ అంతగా ఉండదు. హార్ట్‌బ్రేక్‌ అందరికీ ఉంటుంది.. నాకూ ఉంటుంది (నవ్వుతూ).

► ‘ఒకే ఒక జీవితం’లో ఇంటెన్స్‌ ఉన్న క్యారెక్టర్‌ చేశాను. ఎంత లేదనుకున్నా సబ్‌కాన్షియస్‌లోనైనా ప్రెజర్‌ ఉంటుంది. ఇలాంటి సినిమాలు చేయొద్దని మా డాక్టర్‌ సలహా ఇచ్చారు. ఈ సినిమాతో నాగార్జున, అమలగార్లతో బాగా దగ్గర కాగలిగాను. నాగార్జునగారు నన్ను మూడో కొడుకుగా భావించాననడం హ్యాపీగా ఉంది.

► శ్రీ కార్తీక్‌ మొదటి రోజే దాదాపు 200 షాట్స్‌ తీశాడు. ఏంటి ఇంత స్పీడ్‌గా తీస్తున్నాడు? అనే భయం కలిగింది. అయితే అమలగారి సీక్వెన్సెస్‌ స్టార్ట్‌ అయ్యాక ఎంత క్లారిటీగా తీస్తున్నాడో అర్థం చేసుకున్నాను.

► ఈ మధ్య పద్నాలుగు కేజీల బరువు తగ్గా. నా తర్వాతి సినిమా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఉంటుంది.  

► ఇండస్ట్రీలో నాకు గైడింగ్‌ ఫోర్స్‌ లేదు. ఒక ఫ్లాప్‌ రాగానే కొందరు హీరోలకు పెద్ద డైరెక్టర్‌తో సినిమాలు సెట్‌ అవుతుంటాయి. మాకలా చేసేవారు లేరు. మమ్మల్ని మేమే కాపాడుకోవాలి. నా కెరీర్‌లోని ఒప్పులకు, తప్పులకు నేనే బాధ్యుణ్ణి. ఎందుకంటే ఇలా వెళితే బాగుంటుంది అని చెప్పేవాళ్లు లేరు.  

మరిన్ని వార్తలు