సినిమాలు లేనప్పుడు వ్యవసాయం చేస్తాను: హీరో

11 Mar, 2021 02:54 IST|Sakshi

‘‘మనందరం ‘జై జవాన్‌ – జైకిసాన్‌ ’ అంటుంటాం. వారికి మించిన హీరోలు లేరు. అయితే రైతులు లేకుంటే జవాన్లకి కూడా అన్నం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు నిజమైన గౌరవం ఇవ్వడం లేదు. వారిని గౌరవించాలి’’ అని శర్వానంద్‌ అన్నారు. కిశోర్‌ బి. దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా నటించిన ‘శ్రీకారం’ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శర్వానంద్‌ చెప్పిన విశేషాలు.

► రైతు కొడుకు రైతు కావడం లేదనే పాయింట్‌తో తెరకెక్కిన చిత్రం ‘శ్రీకారం’. వ్యవసాయాన్ని ఓ ఉద్యోగంగానో, వ్యాపారంగానో ఎవరూ చూడటం లేదు.. వ్యవసాయంలో నష్టాలు వస్తుండటంతో ఇటువైపు ఆసక్తి చూపడం లేదు. ఒక్కొక్కరుగా కాకుండా ఊర్లోని అందరూ కలసి ఉమ్మడి వ్యవసాయం చేయాలి.. వచ్చిన లాభాలను సమానంగా పంచుకోవాలి. అలా చేయడం వల్ల ఎవరూ నష్టపోరని మా సినిమాలో చూపిస్తున్నాం. చదువుకున్నవాళ్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేస్తే నష్టాలు రావు.

► ఒక సందేశాన్ని వినోదాత్మకంగా, భావోద్వేగంగా, కమర్షియల్‌గా చెప్పడం కత్తి మీద సామే. కానీ కిశోర్‌ చక్కగా తెరకెక్కించాడు. తండ్రిని చూసి చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేయాలనుకుంటాడు హీరో.. అందుకే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి వ్యవసాయం చేస్తాడు

► ఈ సినిమా కోసం చిత్తూరు జిల్లాలో 40 ఎకరాల్లో వ్యవసాయం చేశాం. లాక్‌డౌన్‌ లో వ్యవసాయం నేర్చుకున్నాను. నాకు సినిమాలు లేనప్పుడు, నటన ఇక చాలు అనుకున్నప్పుడు వ్యవసాయం చేస్తాను.

>
మరిన్ని వార్తలు