అది గుర్తిస్తే లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌

4 Sep, 2022 00:38 IST|Sakshi
శ్రీ కార్తీక్, శర్వానంద్, అమల, రీతూ వర్మ, ఎస్‌ఆర్‌ ప్రభు

– శర్వానంద్‌

‘‘గతం తాలూకు ఆలోచనలతో మనం దిగాలుగా ఉంటే అది బాధ. భవిష్యత్‌ గురించి ఆలోచిçస్తుంటే అది ఆశ. కానీ ఆలోచనలతో ఈ వర్తమాన క్షణాలను ఆస్వాదించడం మనం మర్చిపోతున్నాం. అది గుర్తిస్తే లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌. ఈ విషయాన్నే శ్రీ కార్తీక్‌ ‘ఒకే ఒక జీవితం’తో చెప్పాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో మదర్‌ సెంటిమెంట్‌ అనేది ఒక భాగం మాత్రమే. నా పాత్ర, వెన్నెల కిశోర్, ప్రియదర్శి.. ఇలా ఏదో ఒక క్యారెక్టర్‌తో ప్రతి ఆడియన్‌ కనెక్ట్‌ అవుతారు’’ అన్నారు శర్వానంద్‌.

శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ, శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్‌ కానుంది. ‘‘ఈ చిత్రంలో శర్వానంద్‌ తల్లి పాత్రలో నటించాను. పదేళ్ల తర్వాత నేను చేసిన తెలుగు చిత్రం ఇది. ఈ సినిమాతో నాకు శర్వానంద్‌ మూడో కొడుకు అయ్యారు (నవ్వుతూ). ఈ సినిమాలో ముగ్గురి జర్నీ చూస్తారు.

ఈ ముగ్గురూ కాలంతో ఆడుకుని ఓ అంశాన్ని కరెక్ట్‌ చేయాలనుకున్నప్పుడు విధి మాత్రం మారదు. ఎందుకనేది థియేటర్స్‌లో చూడాలి’’ అన్నారు అమల. ‘‘నేను తెలుగువాడినే. మా అమ్మగారి మాతృభాష తెలుగు. ఇప్పుడు మా అమ్మగారు లేరు. మా అమ్మ గురించి తీసిన సినిమా ఇది.  ఈ సినిమా కోసం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన ‘అమ్మ’ పాట చిరకాలం నిలిచిపోతుంది’’ అన్నారు శ్రీ కార్తీక్‌. ‘‘మా బ్యానర్‌ నుంచి వచ్చిన ‘ఖాకీ’, ‘ఖైదీ’ చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆ నమ్మకంతోనే తెలుగులో స్ట్రయిట్‌ ఫిల్మ్‌ ‘ఒకే ఒక జీవితం’ చేశాం’’ అన్నారు ఎస్‌ఆర్‌ ప్రభు. ‘‘అమలగారు నాకు స్ఫూర్తి’’ అన్నారు రీతూ వర్మ.

మరిన్ని వార్తలు