ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుంది

11 Sep, 2022 04:18 IST|Sakshi
శ్రీ కార్తీక్, అమల, శర్వానంద్, ఎస్‌ఆర్‌ ప్రభు

– శర్వానంద్‌  

‘‘థియేటర్స్‌లో ‘ఒకే ఒక జీవితం’ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్‌ అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుంది. ఈ సినిమా ఇంకెంత విజయం సాధిస్తుంది, ఎంత కలెక్ట్‌ చేస్తుంది? అనే అంశాలను అటుంచితే థియేటర్స్‌లో ప్రేక్షకుల చప్పట్లను వినాలనిపించింది. ప్రేక్షకులు నేను కోరుకున్న ప్రేమను ఇచ్చారు’’ అన్నారు శర్వానంద్‌.

శ్రీ కార్తీక్‌ దర్శకుడిగా పరిచయం అవుతూ శర్వానంద్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). రీతూ వర్మ హీరోయిన్‌గా కీలక పాత్రల్లో అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి నటించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజైంది.

ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్‌ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో శర్వానంద్‌ మాట్లాడుతూ – ‘‘గొప్ప కథ రాసి, విజయానికి కారణమైన దర్శకుడు శ్రీ కార్తీక్‌కు ధన్యవాదాలు. థియేటర్స్‌ స్క్రీన్‌పై అమలగారు కనిపించినప్పుడు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అమలగారు ఇంకా మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. ఎస్‌ఆర్‌ ప్రభుగారు అభిరుచిగల నిర్మాత. మౌత్‌ టాక్‌తో ప్రేక్షకులు మా సినిమాను ముందుకు తీసుకుని వెళ్లాలని కోరుతున్నాను’’ అన్నారు.

‘‘యువత ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొని విజయం సాధించేందుకు మార్గం చూపే చిత్రం ఇది. ఈ సినిమాకు అందరూ కనెక్ట్‌ అవుతారు. శర్వానంద్‌ పరిపూర్ణ నటుడు’’ అన్నారు అమల. ‘‘శర్వానంద్‌–అమలగార్లు స్క్రీన్‌పై తల్లీకొడుకు లుగా ప్రేక్షకుల మనసును హత్తుకున్నారు. ఈ సినిమా అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవ్వడాన్ని గొప్ప విజయంగా భావిస్తున్నా’’ అన్నారు శ్రీ కార్తీక్‌. ‘‘ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు ఎస్‌ఆర్‌ ప్రభు. నటుడు ‘వెన్నెల’ కిశోర్, ఈ చిత్రం కెమెరామేన్‌ సుజిత్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు