నీ ప్రతిభను బాలీవుడ్‌ హ్యాండిల్‌ చేయలేదు

27 Jul, 2020 03:27 IST|Sakshi
రెహమాన్‌, శేఖర్‌ కపూర్‌

ఏఆర్‌ రెహమాన్‌ని ఉద్దేశించి శేఖర్‌ కపూర్‌

‘‘నువ్వు ఆస్కార్‌ అవార్డు అందుకున్నప్పుడే బాలీవుడ్‌ హ్యాండిల్‌ చేయలేనంత టాలెంట్‌ నీది అని నిరూపితమైంది రెహమాన్‌’’ అంటున్నారు ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు, నటుడు శేఖర్‌  కపూర్‌. ‘‘నా దగ్గరకు సినిమా (హిందీని ఉద్దేశించి) లు రానీయకుండా ఓ గ్యాంగ్‌ తెగ ప్రయత్నిస్తోంది. నా గురించి లేనిపోని వార్తలు ప్రచారం చేస్తోంది’’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు  రెహమాన్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెహమాన్‌ కి మద్దతుగా నిలిచారు శేఖర్‌ కపూర్‌. ‘‘రెహమాన్‌ ఈ  సమస్య ఎందుకు ఏర్పడిందో చెప్పనా? నువ్వు ఆస్కార్‌ సాధించిన సంగీత దర్శకుడివి.

ఆస్కార్‌ గెలవడం అంటే బాలీవుడ్‌ లో మృత్యువుని ముద్దాడినట్టే. నిన్ను బాలీవుడ్‌ హ్యాండిల్‌ చేయలేనంత ప్రతిభ నీలో ఉంది అని అర్థం’’ అని ట్వీట్‌ చేశారు శేఖర్‌ కపూర్‌. దీనికి రెహమాన్‌ సమాధానమిస్తూ – ‘డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. పేరు పోతే కూడా సంపాదించుకోవచ్చు. కానీ విలువైన సమయాన్ని వృథా చేస్తే మళ్లీ ఎంత ప్రయత్నించినా తిరిగి తెచ్చుకోలేము. అందుకే ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోవద్దు. మనం చేయాల్సిన గొప్ప పనులు ఎన్నో ఉన్నాయి. వాటి మీద దృష్టిపెడదాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు