ఆ ‘మిస్టరీ గర్ల్‌’ నేను కాదు: నటి

25 Aug, 2020 19:45 IST|Sakshi

ఫేక్‌ న్యూస్‌ అంటూ మండిపడ్డ షిబానీ దండేకర్‌

ముంబై: ‘‘అక్కడ ఉంది నేనో, మరెవరో కాదు! ఏ విషయాన్నైనా ప్రచారం చేసే ముందు ఒకసారి నిజ నిర్ధారణ చేసుకోవాలి.. తను అతడి పీఆర్‌ పర్సన్‌ రాధికా నిహలానీ, తనతో పాటు అక్కడ ఉంది ఆమె అసిస్టెంట్‌. చాలు చాలు! ఇకనైనా నకిలీ వార్తలను కట్టిపెట్టండి! నేను మౌనంగా ఉన్నానంటే.. నా గురించి అబద్దాలు ప్రచారం చేసి నాపై ద్వేషం పెంచే హక్కు మీకు ఇచ్చినట్లు కాదు’’ అంటూ బాలీవుడ్‌ సింగర్‌, నటి షిబానీ దండేకర్‌ సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గురించి తప్పుడు ప్రచారం మానుకోవాలని హెచ్చరించారు. సంబంధం లేని విషయాలతో తన పేరు ముడిపెట్టడం సరికాదని హితవు పలికారు. ఇంతకీ విషయమేమిటంటే... బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి నేపథ్యంలో సోషల్‌ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: ‘విష ప్రయోగం వల్లే సుశాంత్‌ మృతి’)

ఈ క్రమంలో అతడి మరణానికి ముందుకు జరిగిన పరిణామాలపై నెటిజన్లు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ టాలెండెడ్‌ యాక్టర్‌ది హత్యేనంటూ అతడి ఫ్యాన్స్‌ చేస్తున్న వాదనలకు మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్‌ మృతి చెందడానికి ముందు రోజు ఓ మహిళ.. అతడి అపార్డుమెంటు ముందు పనిమనిషితో మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఓ ఫొటో వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ ‘మిస్టరీ గర్ల్‌’ ఎవరన్న విషయం చర్చకు దారితీసింది. సదరు మహిళ ముఖానికి మాస్కు ధరించి వెనక్కి తిరిగి ఉండటంతో ఆమె గురించి కనుక్కోవడం నెటిజన్లకు కష్టంగా మరింది. ఈ క్రమంలో ఓ జాతీయ మీడియా.. తను షిబానీ అని పేర్కొంటూ కథనం ప్రసారం చేసినట్లు సమాచారం. (చదవండి: సుశాంత్ ఫ్లాట్‌లో డ‌మ్మీ టెస్ట్ నిర్వ‌హించిన సీబీఐ)

ఇక ఈ విషయంపై ఘాటుగా స్పందించిన షిబానీ.. ఆ ఫొటోలో ఉన్నది తాను కాదని, ఆ అమ్మాయి సుశాంత్‌ పీఆర్‌ పర్సన్‌ అని చెప్పుకొచ్చారు. మరి ఈ విషయంపై రాధికా నిహలానీ ఎలా స్పందిస్తారో చూడాలి! కాగా సుశాంత్‌ మృతి కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్‌ ప్రేయసి, నటి రియా చక్రవర్తిని ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు