సోనూ సూద్‌ నెక్ట్స్‌ మిషన్‌ ఇదే!

25 Jan, 2021 16:20 IST|Sakshi

సాక్షి, ముంబై:  నటుడు సోనూ సూద్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులను ఆదుకుని రియల్‌ హీరోగా నిలిచిన తన మిషన్‌ను నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎంతోమంది ఆపన్నులను ఆదుకోవడంతోపాటు, అనేకమంది పేద విద్యార్థుల చదువులు నిలిచిపోకుండా విశేష కృషి చేశారు. ఈక్రమంలో తాజాగా స్టార్ట్‌ఫోన్‌ తయారీదారు షావోమితో జత కలిసారు.  

ఈ విషయాన్ని సోనూ సూద్‌ స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘‘మనమంతా ఐక్యంగా పోరాడి మార్గం ఎంత కఠినమైనా.. ఓటమిని అంగీకరించేది లేదంటూ కలల సాకారాన్ని  నిరూపించి చూపాం. ఈ క్రమంలో మరో మార్గాన్ని  చేపట్టాం.  మీ అందరి సాయంతో ఈ పరంపరను ఇకపై కూడా కొనసాగిద్దాం..’’ ఈ రోజునుంచి ఏ విద్యార్థి తన ఆన్‌లైన్‌ క్లాస్‌లను మిస్‌కాకూడదు అంటూ మరోసారి పునరుద్ఘాటించిన ఆయన  ఒక కొత్త  మిషన్‌ను ప్రకటించారు. ఈ మేరకు ఒక వీడియోను కూడా సోనూ షేర్‌ చేశారు.   సౌకర్యాల లేమి ఎంత కృంగదీస్తుందో తెలుసు.. అందుకే షావోమితో జతకలిసానని ఆయన వెల్లడించారు. అందరి సహాకారంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేల స్మార్ట్‌ఫోన్లను విద్యార్థులకు అందిద్దామంటూ పిలుపు ఇచ్చారు. ఇందుకోసం ఎంఐ ఇండియా ఆధ్వర్యంలో తాను చేపట్టిన ‘శిక్షా హర్‌ హాత్’కోసం‌ ప్రతిజ‍్ఞ పూనాలని సూచించారు. మీలో ఎవరిదగ్గరైనా, పూర్తిగా పనిచేస్తూ ఉండి.. మీకు ఉపయోగపడకుండా ఉన్న ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ ఉంటే మాకు తెలపండి..మేం దాన్ని అర్హులైన విద్యార్థులకు అందజేస్తా మంటూ ఆయన తన వీడియో సందేశంలో వెల్లడించారు.  ఈ వీడియోలో షావోమి గ్లోబల్‌ వైస్‌ప్రెసిడెంట్‌ మనోజ్‌కుమార్‌ జైన్‌ కూడా ఉన్నారు. పూర్తి కండిషన్‌లో ఉండి, డొనేట్‌ చేయాలనుకుంటున్న తమ పాత స్మార్ట్‌ఫోన్‌ సమాచారాన్ని యూజర్లు సమీపంలోని ఎంఐ కేంద్రంలో అందించాలని మనుకుమార్‌ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు