Shivakarthikeyan: ఆ విషయంలో హీరోయిన్లే నాకు స్ఫూర్తి 

7 Oct, 2021 07:50 IST|Sakshi

‘‘నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ నా క్లోజ్‌ ఫ్రెండ్‌. 2007లో నేను టీవీ కెరీర్‌ స్టార్ట్‌ చేశాను. ఆ షోను నెల్సన్‌ డైరెక్ట్‌ చేశాడు. నెల్సన్‌పై ఉన్న నమ్మకంతోనే ‘వరుణ్‌ డాక్టర్‌’ సినిమాతో నిర్మాతగా మారాను’’ అని హీరో శివ కార్తికేయన్‌ అన్నారు. నెల్సన్‌ దర్శకత్వంలో శివ కార్తికేయన్, ప్రియాంకా అరుల్‌ మోహన్‌ జంటగా నటించిన చిత్రం ‘వరుణ్‌ డాక్టర్‌’. శివ కార్తికేయన్‌ సమర్పణలో కోటపాడి జె. రాజేష్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా శివ కార్తికేయన్‌ మాట్లాడుతూ– ‘‘వరుణ్‌ డాక్టర్‌’లో నా పేరు వరుణ్‌. ఆర్మీ డాక్టర్‌ అన్నమాట. సొంతూరుకు వచ్చి ఏం చేశాడు? అనేది కథ. హ్యూమన్‌ ట్రాఫికింగ్, ఆర్గాన్‌ ట్రాఫికింగ్‌ నేపథ్యంలో సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో నా పాత్ర సీరియస్‌గా ఉంటుంది. ఈ మూవీలో తమిళ వెర్షన్‌లో ‘చెల్లమ్మ, సో బేబీ’... పాటలు రాశా. ‘సో బేబీ..’ వీడియో చూసి ‘బుట్టబొమ్మ’ పాటలా ఉందనడం హ్యాపీ.

తెలుగులో నేరుగా ఓ సినిమా కమిట్‌ అయ్యాను. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటున్నాను. తెలుగులో చేయనున్న సినిమాకి హీరోయిన్లందరూ నాకు స్ఫూర్తి. వాళ్లు ఓ రోజు చెన్నైలో, మరో రోజు హైదరాబాద్‌లో, ముంబైలో షూటింగ్స్‌లో పాల్గొంటుంటారు.. భాష రాకున్నా డైలాగులు రాసుకుని, మీనింగ్‌ తెలుసుకుని ప్రాక్టీస్‌ చేస్తారు. నేనూ అలా కష్టపడాలని అనుకుంటున్నా’’ అన్నారు. 

మరిన్ని వార్తలు