Prabhas Wax Statue: ఇదేందిది.. ఇది ప్రభాస్‌ విగ్రహమా? నెట్టింట ట్రోలింగ్‌.. బాహుబలి నిర్మాత సీరియస్‌

26 Sep, 2023 10:49 IST|Sakshi

ఆరడుగుల అందగాడు.. అమ్మాయిల మనసు కొల్లగొట్టిన ఆజానుబాహుడు.. మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌.. ప్రభాస్‌. బాహుబలి సినిమాతో ఆలిండియా మొత్తం అభిమానులను సంపాదించుకున్నాడీ స్టార్‌ హీరో. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల మైనపు బొమ్మలను ఏర్పాటు చేసే మేడమ్‌ టుస్సాడ్స్‌లోనూ ప్రభాస్‌ మైనపు విగ్రహం ఉంది. 2017లోనే ఆయన విగ్రహం ఏర్పాటైంది.

ఆయన డార్లింగా?
అయితే తాజాగా మరోచోట ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మైసూర్‌లోని ఓ స్టేడియంలో బాహుబలి గెటప్‌లో ఉన్న ప్రభాస్‌ మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. ఏ యాంగిల్‌లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు? అసలు అక్కడున్నది డార్లింగ్‌ అని గుర్తుపట్టడమే కష్టంగా ఉందంటున్నారు. కొందరు నెటిజన్లేమో.. కొంత రామ్‌చరణ్‌లా, మరికొంత బిగ్‌బాస్‌ సన్నీలా కనిపిస్తున్నాడని సెటైర్లు వేస్తున్నారు. అసలు బాహుబలి పోలికలే లేవని, ఇంత ఘోరంగా ఎలా తయారు చేశారని విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించాడు.

'మాకు కనీస సమాచారం అందించకుండా, మా అనుమతులు తీసుకోకుండా ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహాన్ని తొలగించేందుకు తక్షణమే చర్యలు చేపడతాం' అని నిర్మాత ట్వీట్‌ చేశాడు. ఇది చూసిన జనాలు.. 'హమ్మయ్య, మీరు చెప్పాక కానీ ఆయన ప్రభాస్‌ అని మాకు అర్థం కాలేదు, థాంక్యూ..' అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరికొందరేమో.. 'దేశం మొత్తం మీద ఎక్కడ బాహుబలి బొమ్మలు ఉన్నా అన్నీ లైసెన్స్‌ తీసుకునే చేస్తున్నారా? ఆ విగ్రహాల వెనక పరిగెత్తే బదులు లైట్‌ తీసుకోవచ్చుగా' అని ఉచిత సలహా ఇస్తున్నారు.

చదవండి: శివాజీ నోటిదూల.. 'ఎక్స్‌' టాపిక్‌.. నీ క్యారెక్టర్‌ ఏంటంటూ శుభశ్రీపై ఫైర్‌

మరిన్ని వార్తలు