రెమ్యునరేషన్‌ పెంచిన తమన్‌.. ఒక్కో మూవీకి ఎంతంటే..

4 May, 2021 15:56 IST|Sakshi

మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ మంచి ఊపు మీద ఉన్నాడు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వరస సినిమాలకు సంగీతం అందిస్తూ టాలీవుడ్‌లో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా దూసుకెళ్తున్నాడు. ‘అల వైకుంఠపురము’లో తర్వాత ఆయన సంగీతంలో మరింత కొత్తదనం కనిపిస్తోంది. రొటీన్‌గా కాకుండా ఢిపరెంట్‌ స్టైల్‌లో సంగీతం అందించి ఆకట్టుకుంటున్నాడు. ఆయన ఈ ఏడాది ‘క్రాక్‌’, ‘వకీల్‌సాబ్‌’, ‘వైల్డ్‌ డాగ్‌’ లాంటి పెద్ద సినిమాలకు సంగీతం అందించాడు. వాటిలో ‘వకీల్‌సాబ్‌’లోని పాటలు జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘మగువా’ సాంగ్‌ సూపర్‌ హిట్‌ అయింది. ఇలా మెలోడీలతో పాటు మాస్‌ సాంగ్స్‌ని కూడా ఆకట్టుకునేలా కంపోజ్‌ చేస్తూ.. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌కు సరైన పోటీగా నిలుస్తున్నాడు.

ప్రస్తుతం తమన్‌ బాలకృష్ణ ‘అఖండ’, మహేశ్‌ బాబు ‘సర్కారువారి పాట’, పవన్‌ కల్యాణ్‌ ‘అయ్యప్పనుమ్‌ కొషియుమ్‌’ రీమేక్‌,  నాని ‘టక్‌ జగదీశ్‌’ అఖిల్‌ ‘ఏజెంట్‌’, శంకర్‌- రామ్‌చరణ్‌ మూవీ సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. వరుస విజయాలతో దూసుకెళ్తున్న తమన్‌.. తాజాగా తన రెమ్యునరేషన్‌ని కూడా పెంచేశాడట. ‘అల వైకుంఠపురములో’ వరకు రూ. కోటి కంటే తక్కువ తీసుకునే తమన్‌.. ఆ తర్వాత తన పారితోషికాన్ని కోటిన్నర వరకు పెంచేశాడట. ఇక ఈ ఏడాది క్రాక్‌, వకీల్‌సాబ్‌ కూడా సూపర్‌ హిట్‌ కావడంతో మరో 50 లక్షలు పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమన్‌ ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు పుచ్చుకుంటున్నాడట. కొన్ని సినిమాలకు బడ్జెట్‌ని బట్టి తీసుకుంటాడని టాక్‌. కథ నచ్చితే తక్కువ తీసుకోనైనా సంగీతం అందిస్తాడని తమన్‌కు పేరుంది. ఇక రాక్‌స్టార్‌ దేవీశ్రీ ప్రసాద్‌ ఒక్కో సినిమాకు రూ.3కోట్లు తీసుకుంటారని సమాచారం.


చదవండి :
త్రివిక్రమ్‌ సినిమా : మరోసారి మహేశ్‌కు జోడిగా ఆ హీరోయిన్‌
బెడ్‌ సీన్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన రాశీ ఖన్నా

మరిన్ని వార్తలు