అందమైన అభినయం సోనాలి సొంతం..

21 Feb, 2021 09:50 IST|Sakshi

అందమే ఆమెకు ఆయుధం అనుకునే వారందరినీ తన అభినయంతో ఆశ్చర్యానికి గురిచేసింది ‘తాండవ్‌’ బ్యూటీ సోనాలీ నగ్రానీ. నటిగా తనకంటూ ఒక గుర్తింపు సాధించుకోవడమే కాక అతి కొద్దికాలంలోనే సైఫ్‌ అలీఖాన్‌ వంటి స్టార్స్‌తో నటించే అవకాశాన్నీ దక్కించుకుంది.

ఢిల్లీలో స్థిరపడిన సింధీ ఫ్యామిలీకి చెందిన సోనాలీ 1983, డిసెంబర్‌ 20న జన్మించింది. 2003లో లేడీ శ్రీరామ్‌ కాలేజీలో డిగ్రీ చేసింది. చిన్నతనం నుంచే ఆమెకు నటన, నృత్యంపై మక్కువ ఎక్కువ. వీటితోపాటు ట్రావెలింగ్, హార్స్‌ రైడింగ్, స్విమ్మింగ్‌ ఆమె హాబీస్‌. స్కూల్‌ నుంచి కాలేజీ వరకు విరివిగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేది. అలా కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌ రంగంలోకి వెళ్లింది. ముందు సోనాలీ లెక్చరర్‌ కావాలనుకుంది. ఆర్థిక కారణాలతో ప్రారంభంలో న్యూస్‌రీడర్‌గా పనిచేసేది. అంతేకాదు, ‘తేరీ యాద్‌ జబ్‌ ఆతీ హై’ మ్యూజిక్‌ ఆల్బమ్‌కు గీత రచన కూడా చేసింది. మోడల్‌గా మంచి పేరు రావడంతో ఫ్యాషన్‌ ప్రపంచమే తన జీవితమని నిర్ణయించుకుంది. అందుకే ‘2002 మిస్‌ ఢిల్లీ క్వీన్‌’, ‘2003 ఫెమినా మిస్‌ ఇండియా’ కిరీటాలతో పాటు, ‘2003 ఫెమినా మిస్‌ ఇంటర్నేషనల్‌’ మొదటి రన్నరప్‌ టైటిల్‌ సాధించింది. 

చాంపియన్స్‌ట్రోఫీ, ఐపీఎల్‌ తదితర టోర్నీలకు హోస్ట్‌గా చేయడంతో క్రికెట్‌ అభిమానులు ఆమెను ఎక్కువగా గుర్తుపడతారు. ఐఫా అవార్డ్‌ ఇన్‌ దుబాయ్, గిమా ఇన్‌ మలేషియా వంటి అవార్డ్‌ ఫంక్షన్స్‌కు కూడా హోస్ట్‌గా చేసి మంచి గుర్తింపు పొందింది. ‘ఖత్రోం కే ఖిలాడీ’ షో ద్వారా బుల్లితెర నటిగా పరిచయమైంది. ఆ తర్వాత చేసిన బిగ్‌బాస్‌ సీజన్‌–5 రియాల్టీ షో ఆమె పాపులారిటీని అమాంతం పెంచింది. ఈ కారణంగానే ఆమెకు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన ‘టాప్‌ 50 మోస్ట్‌ డిజైరబుల్‌ విమెన్‌’ లిస్ట్‌లో వరుసగా రెండేళ్లు చోటు దక్కింది. 

కేవలం బుల్లితెరకే పరిమితం కాకుండా ‘రబ్‌నే బనాదీ జోడీ’, ‘దిల్‌ బోలే హడిప్పా’ వంటి బాలీవుడ్‌ సినిమాల్లో సపోర్టింగ్‌ యాక్ట్రెస్‌గానూ నటించింది. 2013లో తన స్నేహితుడు, ఫొటోగ్రాఫర్‌ శిరాజ్‌ భట్టాచార్యను ప్రేమ వివాహం చేసుకుంది. నా వయసు అమ్మాయిలందరూ లైఫ్‌లో తొందరగా సెటిల్‌ అవ్వాలనే ఆశపడతారు. నేను కూడా అంతే. అయితే జీవితమంతా ఆనందంగా ఉండలేము. కొన్నిసార్లు కష్టాలు తప్పవు. అందుకే వీలైనంత వరకు ఆనందంగా ఉండేందుకే నేను ప్రయత్నిస్తుంటా.

చదవండి: సునీత బాటలో సురేఖ.. రెండో పెళ్లికి సిద్ధం!

మరిన్ని వార్తలు