నవంబర్‌లో ‘స్టార్స్‌’‌ హుషార్‌

5 Nov, 2020 00:02 IST|Sakshi

స్టార్స్‌ ఉంటే ఆకాశం నిండుగా ఉంటుంది. స్టార్స్‌ ఉంటే సినిమాలు సందడిగా ఉంటాయి. కోవిడ్‌ వల్ల సినిమాల చిత్రీకరణలు అటూఇటూ అయ్యాయి. స్టార్స్‌ సినిమాలంటే భారీ కాన్వాస్‌తో కూడుకున్నవి. అందుకే కాస్త గ్యాప్‌ ఇచ్చి పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగుతున్నారు. ఈ నవంబర్‌లో చాలా మంది స్టార్స్‌ మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెడుతున్నారు. కొందరు కొత్త సినిమా షూటింగ్‌ మొదలు పెట్టనున్నారు. మరికొందరు మధ్యలో ఉన్నవాటిని ముగించనున్నారు. ఆ విశేషాలు.

వేసవిలో మెగామాస్‌
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. కాజల్‌ కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల 9న మళ్లీ ఆరంభం కానుంది. ‘నెలరోజుల పాటు సాగే షెడ్యూల్‌తో చాలా శాతం చిత్రీకరణ పూర్తి చేయనున్నాం. వచ్చే ఏడాది వేసవిలో థియేటర్స్‌లో మెగామాస్‌ చూస్తారు’ అని చిత్రబృందం పేర్కొంది.

ఎంట్రీ షురూ
బాలకృష్ణ–బోయపాటి కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయింది. అయితే నవంబర్‌ 16 నుంచి బాలకృష్ణ లొకేషన్‌ ఎంట్రీ షురూ అయిందని తెలిసింది.

క్రాక్‌ టు ఖిలాడీ
పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ నుంచి పక్కా పోకిరిగా మారబోతున్నారు రవితేజ. ఆయన ప్రస్తుతం గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్‌’ సినిమా చేస్తున్నారు. అందులో రవితేజ పోలీస్‌గా కనిపిస్తారు. ఇది పూర్తి కాగానే రమేష్‌ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా ప్రారంభించనున్నారు. ఇందులో ఆయన ఖిలాడీగా కనిపిస్తారు. నవంబర్‌ చివరి వారంలో చిత్రీకరణలో పాల్గొంటారట రవితేజ.

అడవిలోకి పుష్ప
అల్లు అర్జున్, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రీకరణ  కోసం నవంబర్‌ 6 నుంచి 10 మధ్యలో రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అడవులకు ప్రయాణం కానుంది యూనిట్‌.  30 రోజుల పాటు దట్టమైన అడవుల్లో చిత్రీకరణ జరపనున్నారు.

ముంబైలో ఫైటర్‌
పూరి జగన్నాథ్, విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో మార్షల్‌ ఆర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ‘ఫైటర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) తెరకెక్కుతోంది. ఇందులో కిక్‌ బాక్సర్‌గా విజయ్‌ దేవరకొండ కనిపిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్‌ మూడు లేదా నాలుగో వారం నుంచి ముంబైలో ఆరంభం కానుంది.

శ్రీదేవి సోడా సెంటర్‌
సుధీర్‌బాబు హీరోగా ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ అనే కొత్త చిత్రం ఇటీవలే ప్రకటించారు. ‘పలాస’ ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకుడు. గోదావరి పరిసర ప్రాంతాల్లో నవంబర్‌ రెండో వారం నుంచి ఈ సినిమా షూటింగ్‌ ఆరంభం కానుంది.
వచ్చే ఏడాది సంక్రాంతి, వేసవికి సినిమాలను థియేటర్స్‌లోకి తీసుకురావడానికి చిత్రబృందాలు ప్లాన్‌ చేస్తున్నాయి. ఈ ఏడాది మిస్సయిన జోష్‌ని వచ్చే ఏడాది రెండింతలు ఇవ్వడానికి ఇండస్ట్రీ రెడీ అవుతోంది.

ఫుల్‌ స్పీడ్‌
స్టార్స్‌ అందరిలో ముందుగా షూటింగ్‌లో పాల్గొన్న హీరో నాగార్జున. ప్రస్తుతం ‘వైల్డ్‌ డాగ్‌’ను పూర్తి చేసే పనిలో ఉన్నారాయన. అలాగే పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’, శర్వానంద్‌ ‘శ్రీకారం’, నాగశౌర్య కొత్త చిత్రం, అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, కార్తికేయ ‘చావు కబురు చల్లగా’ సినిమాలు ఫుల్‌ స్పీడ్‌లో షూటింగ్స్‌ జరుగుతున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా