హు కిల్డ్‌ శ్రద్ధా వాకర్‌.. సినిమాగా రానున్న సంచలన హత్య కేసు

20 Nov, 2022 20:06 IST|Sakshi

ప్రియుడి ప్రేమ కోసం కన్నతల్లిదండ్రులనే కాదనుకుందా అమ్మాయి. అయినవాళ్లను కాదనుకునేంత పిచ్చిగా ప్రేమించినందుకు ఆమెకు జీవితమే లేకుండా చేశాడా ప్రియుడు. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న శ్రద్ధా వాకర్‌ ఉదంతమిదీ! తాజాగా శ్రద్ధా హత్యా కేసును సినిమాగా తెరకెక్కించేందుకు ముందుకు వచ్చాడు బాలీవుడ్‌ దర్శకనిర్మాత మనీష్‌ సింగ్‌. ఇప్పటికే సినిమా పనులు ప్రారంభమయ్యాయని ప్రకటించాడు. పెళ్లి చేసుకుంటామని నమ్మిస్తూ అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న ప్రేమపిశాచాల గురించి సినిమాలో వివరిస్తానని స్పష్టం చేశాడు. బృందావన్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై సినిమా నిర్మించనున్నట్లు తెలిపాడు. ఈ చిత్రానికి హు కిల్డ్‌ శ్రద్ధా వాకర్‌ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. మరి ఈ సినిమాలో శ్రద్ధా పాత్రలో ఏ హీరోయిన్‌ నటిస్తుందో చూడాలి!

శ్రద్ధా వాకర్‌ మర్డర్‌ కేసు గురించి..
మూడేళ్ల క్రితం శ్రద్ధా వాకర్‌, అఫ్తాబ్‌ మధ్య పరిచయం ఏర్పడింది. ప్రేమించుకున్నారు, పెద్దలు ఒప్పుకోకపోవడంతో సహజీవనం మొదలుపెట్టారు. మే 18న శ్రద్ధ-అఫ్తాబ్‌ల మధ్య గొడవ జరిగింది. ఇంకెన్నాళ్లు సహజీవనం, పెళ్లి చేసుకుందామని పట్టు పట్టింది శ్రద్ధ. కుదరదన్నాడు, గొడవ పెద్దదైంది. శ్రద్ధ గొంతు నలిమి చంపాడు. శవాన్ని మాయం చేసేందుకు పథకం వేశాడు. పెద్ద ఫ్రిడ్జ్‌ కొని ఇంటికి తెచ్చాడు. శ్రద్ధ శవాన్ని 35 ముక్కలుగా కోసి కవర్లలో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. రోజూ కొన్ని అవయవాలు చొప్పున ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. ఆరు నెలల తర్వాత ఈ కేసు బయటపడింది.  ఈ కేసులో నిందితుడు, శ్రద్ధా ప్రియుడు అఫ్తాబ్‌ నేరాన్ని అంగీకరించగా అతడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు.

చదవండి: శ్రద్ధా హత్య కేసు, అడవిని జల్లెడ పట్టిన పోలీసులు
 

మరిన్ని వార్తలు