ఒక్కో బుక్‌... ఒక్కో కిక్‌

7 Aug, 2020 01:02 IST|Sakshi
శ్రియ

లాక్‌ డౌన్‌ లో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా సమయాన్ని వినియోగించుకుంటున్నారు. యోగా, ధ్యానం, డాన్స్, కుకింగ్, బుక్స్‌... ఇవన్నీ శ్రియను బిజీగా ఉంచుతున్నాయట. ఈ లాక్‌ డౌన్‌లో చదివిన పుస్తకాల గురించి ఓ వీడియోను పంచుకున్నారామె. ఒక్కో బుక్‌ ఒక్కో కిక్‌ ఇచ్చిందంటున్నారీ బ్యూటీ. ఇటీవల తాను చదివిన పుస్తకాల గురించి శ్రియ మాట్లాడుతూ –‘‘విలియమ్‌ డాల్‌ రాసిన ‘అనార్కీ’ చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను. 

నాకు చరిత్ర అంటే చాలా ఇష్టం. చరిత్రకు సంబంధించిన విషయాలు భలే ఆసక్తికరంగా అనిపిస్తుంటాయి. దక్షిణ భారత దేశానికి సంబంధించిన చరిత్ర పుస్తకాలు వెతుకుతున్నాను. ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రదర్శకుడు  ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కప్పొల రచించిన  ‘లివ్‌ సినిమా అండ్‌ ఇట్స్‌ టెక్నిక్స్‌’ చదివాను. సినిమాలంటే ఇష్టం ఉన్నవాళ్లు, సినిమాల్లో పని చేసేవాళ్లు ఈ బుక్‌ కచ్చితంగా చదవాలి. చాలా స్ఫూర్తివంతంగా అనిపించింది. ఈ పుస్తకాన్ని ఆండ్రూ (శ్రియ భర్త) నాకు గిఫ్ట్‌ గా ఇచ్చాడు.

రచయిత జో డిస్పెంజ్‌ ‘బికమింగ్‌ సూపర్‌ న్యాచురల్‌’లో మన మెదడు ఎలా పని చేస్తుందో భలే చెప్పాడు. ట్రెవోర్‌ నోహా రాసిన ‘బోర్న్‌ క్రై మ్‌’ సరదాగా సాగింది. ‘ఉమెన్‌ హూ రన్‌ విత్‌ ఉల్ఫ్వ్‌’ మన స్పిరిట్‌ని పెద్ద స్థాయిలో ఉంచుతుంది. యోగాకి సంబంధించి ‘కృష్ణమాచార్య : హిజ్‌ లైఫ్‌ అండ్‌ టీచింగ్స్‌’ చదివాను. విపాసనకు సంబంధించి కొన్ని పుస్తకాలు చదివాను. ఈ పుస్తకాలన్నీ మీరు కూడా చదివి ఆనందిస్తారని, నేర్చుకుంటారని అనుకుంటున్నాను. మీరు కూడా నాకేదైనా పుస్తకాలు సూచించండి. విషాదంగా ఉండే పుస్తకాలు మాత్రం వద్దు’’ అన్నారు శ్రియ.

మరిన్ని వార్తలు