నా కూతురు గర్వపడే సినిమాలు చేయాలనుకుంటున్నాను

8 Dec, 2021 05:38 IST|Sakshi

‘‘సినిమాల పట్ల నా ఆలోచనా ధోరణి మారింది. నా కుటుంబం, నా కూతురు రాధ నా సినిమాలను చూసి గర్వపడేలా చాలెంజింగ్‌ రోల్స్‌ చేయాలనుకుంటున్నాను. మనసుకు నచ్చిన పాత్రలే చేస్తాను’’ అని శ్రియ అన్నారు. శ్రియ, శివ కందుకూరి, ప్రియాంకా జవాల్కర్‌ ప్రధాన పాత్రల్లో నిత్యా మీనన్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘గమనం’. సంజనా రావు దర్శకత్వంలో రమేశ్‌  కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రియ చెప్పిన విశేషాలు.

∙‘గమనం’ చిత్రంలో దివ్యాంగురాలు కమల పాత్రలో కనిపిస్తాను. కమలకు వినపడదు. కానీ మాట్లాడుతుంది. ఇందులో మూడు కథలు ఉన్నాయి. ఈ మూడు కథలూ ఓ ప్రకృతి విపత్తు (భారీ వర్షం) కారణంగా కనెక్ట్‌ అవుతాయి. ‘గమనం’ కథ విన్నప్పుడు ఏడ్చాను. కథకు, కమల పాత్రకు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాను. నిస్సహాయతతో ఉన్న ఓ మహిళ సాగించే ప్రయాణమే కమల జీవితం. ఈ పాత్ర కోసం బట్టలు కుట్టడం నేర్చుకున్నాను. ∙మహిళా దర్శకులతో వర్క్‌ చేయడం నాకు కొత్త కాదు. దీపా మెహతా, కన్నడంలో ఓ సినిమా చేశాను. అయితే తెలుగులో లేడీ డైరెక్టర్‌ తెరకెక్కించిన సినిమా చేయడం నాకిదే తొలిసారి. ఒకప్పుడు సెట్స్‌లో నేను, నా మేకప్‌ ఉమన్‌ తప్ప ఎవరూ మహిళలు ఉండేవారు కాదు. అయినా నా ప్రైవసీకి ఏ ఇబ్బంది కలగలేదు. కానీ  మహిళా దర్శకులు అయితే ఏదైనా ప్రాబ్లమ్‌ ఉన్నప్పుడు ధైర్యంగా చెప్పుకోగలం. కాస్త చనువు కూడా ఉంటుంది. ఈ సినిమాకు ఇళయరాజాగారితో వర్క్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. నా తర్వాతి సినిమా ‘మ్యూజిక్‌ స్కూల్‌’కి కూడా ఆయనే సంగీత దర్శకులు. ∙నేను ఇండస్ట్రీకి వచ్చి ఇరవయ్యేళ్లయింది. నా తొలి సినిమా ‘ఇష్టం’ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి.

నా సుదీర్ఘమైన ప్రయాణానికి ప్రేక్షకుల ప్రేమే కారణమని నమ్ముతాను. మరో ఇరవయ్యేళ్లు ప్రేక్షకుల ప్రేమను పొందాలని ఉంది. అందుకు కష్టపడతాను. అక్కినేని నాగేశ్వరరావుగారు చివరి క్షణం వరకు నటించారు. ‘మనం’ సినిమా సమయంలో ‘ఒకవేళ నేను చనిపోతే ఈ సినిమా చేసే చనిపోతాను’ అని ఆయన అన్న మాటలు నాకు గుర్తున్నాయి. ఆయనలా నాక్కూడా చివరి క్షణం వరకూ నటించాలని ఉంది. ∙పదినెలల క్రితమే బార్సిలోనాలో నేను ఓ పాపకు జన్మనిచ్చాను. నాకు పాప పుట్టాలనే కోరుకున్నాను. ‘రాధారాణి’ పేరును మా అమ్మగారు సూచించారు. రష్యన్‌ భాషలో రాధ అంటే హ్యాపీ అని మా ఆయన ఆండ్రీ అన్నారు. సంస్కృతంలో కూడా హ్యాపీ అనే అర్థం వస్తుంది. అందుకని ‘రాధ’ అని పెట్టాం. రాధ వచ్చిన తర్వాత మా లైఫ్‌ మారిపోయింది. పాప జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా ఆలోచించాలి. ఈ ఫీలింగ్‌ చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ∙బయోపిక్స్‌ అని కాదు కానీ కథక్‌ డ్యాన్స్‌ నేపథ్యంలో ఏదైనా సినిమా వస్తే చేయాలని ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా గురించి  మరో సందర్భంలో మాట్లాడతాను. 
 

మరిన్ని వార్తలు