Shruti Haasan: తండ్రితో కలిసి ఆల్బమ్‌ చేయబోతున్న శృతి హాసన్‌..

24 Sep, 2023 09:59 IST|Sakshi

విశ్వనటుడు కమల్‌ హాసన్‌, ఆయన కూతురు.. నటి, గాయని, సంగీత దర్శకురాలు శ్రుతిహాసన్‌ల కాంబినేషన్‌లో చిత్రం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ క్రేజీ ప్రాజెక్ట్‌ చాలా కాలం క్రితమే మొదలైంది. కానీ అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. ఇది వారి అభిమానులను తీవ్ర నిరాశ పరిచిందనే చెప్పాలి. అలాంటి వారికి గుడ్‌న్యూస్‌..

తాజాగా కమల్‌ హాసన్‌, శ్రుతి హాసన్‌ కలిసి ఒక మ్యూజికల్‌ ఆల్బమ్‌ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని శనివారం నాడు మీడియా ద్వారా వెల్లడించారు. శ్రుతిహాసన్‌కు మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ చేయడం కొత్తేమీ కాదు. ఇంతకుముందు షీ ఈజ్‌ ఏ హీరో, ఎడ్జ్‌.. ఇలా రెండు ఆల్బమ్‌లు చేశారు. కాగా మూడవ ఆల్బమ్‌ను తన తండ్రి కమల్‌ హాసన్‌తో కలిసి చేయబోవడం విశేషం. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఓ అవార్డు వేడుకలో కమల్‌ హాసన్‌ ఈ మ్యూజిక్‌ ఆల్బమ్‌ గురించి మాట్లాడారు.

ప్రస్తుతం ఆయన తన 233వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. మరో పక్క బిగ్‌బాస్‌ రియాల్టీ గేమ్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరించడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు శ్రుతిహాసన్‌ తెలుగులో ప్రభాస్‌ సరసన నటిస్తున్న సలార్‌ చిత్రాన్ని పూర్తి చేసి హీరో నాని 'హాయ్‌ నాన్న' చిత్రంలో నటిస్తున్నారు. ఎన్నై కేళుంగళ్‌ అనే టీవీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తన తండ్రి కమల్‌ హాసన్‌తో కలిసి రూపొందించనున్న మ్యూజిక్‌ ఆల్భమ్‌ గురించి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

చదవండి: ఏడేళ్లుగా వాయిదా పడుతూ విడుదల రేసులోకి వచ్చిన విక్రమ్‌ సినిమా

మరిన్ని వార్తలు