‘రియా, సుశాంత్‌ కలిసి గంజాయి తాగేవారు’

3 Sep, 2020 12:51 IST|Sakshi

సంచలన విషయాలు వెల్లడించిన సుశాంత్‌ మేనేజర్‌

ముంబై: నటి రియా చక్రవర్తికి కూడా గంజాయి తాగే అలవాటు ఉందని దివంగత హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మేనేజర్‌ శృతి మోదీ సీబీఐకి వెల్లడించినట్లు సమాచారం. సుశాంత్‌తో పాటు అతడి హౌజ్‌ కీపింగ్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరండా, రియా, ఆమె సోదరుడు షోవిక్ టెర్రస్‌పై గంజాయి పీల్చేవారని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శృతి సీబీఐ అధికారులతో వ్యాఖ్యానించినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. కాగా సుశాంత్‌ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి వాట్సాప్‌ చాట్‌ బహిర్గతమైన సంగతి తెలిసిందే. వీటి ద్వారా.. ఆమె నిషేధిత డ్రగ్స్‌ గురించి తన స్నేహితులతో చర్చించినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌ వ్యవహారంపై దృష్టి సారించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) రియాపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ముంబైలోని బాంద్రాకు చెందిన అబ్దుల్ బాసిత్ పరిహార్‌ను బుధవారం అరెస్టు చేసింది. (చదవండి: సుశాంత్‌ గంజాయి తాగేవాడు, నేనేం చేయగలను: రియా)

ఇక డ్రగ్స్‌ విషయం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రియా.. ‘‘నన్ను కలిసే కంటే ముందు నుంచే సుశాంత్‌కు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉంది. గంజాయి తాగేవాడు. నాకు తెలిసి కేదార్‌నాథ్‌ షూటింగ్‌ సమయంలో అనుకుంటా అలవాటు చేసుకున్నాడు. మానుకోమని చెప్పడం వరకే నా పాత్ర. ఈ విషయం గురించి సుశాంత్‌ మేనేజర్‌ శృతి మోదీతో నేను చాలా సార్లు చర్చించాను. నేనెప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదు’’ అని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు సీబీఐ విచారణలో శృతి మోదీ చెబుతున్న విషయాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. సుశాంత్‌తో కలిసి రియా గంజాయి పీల్చేవారని చెప్పడంతో ఆమె చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది.(చదవండిసుశాంత్‌ అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు: తండ్రి )

ఇదిలా ఉండగా.. సుశాంత్‌ మృతి కేసులో రియా తండ్రి ఇంద్రజిత్‌ చక్రవర్తి ఈరోజు సీబీఐ ఎదుట హాజరయ్యారు. శాంతాక్రజ్‌లోని కాలీనాలో గల డీఆర్‌డీవో గెస్ట్‌హౌజ్‌లో విచారణ కొనసాగుతోంది. ఇక బుధవారం సైతం సీబీఐ అధికారులు ఆయనపై పది గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు.. సుశాంత్‌ సింగ్‌కు జీవిత బీమా పాలసీ ఉందని, ఆత్మహత్య చేసుకున్నాడని తేలితే ఈ మొత్తం రాదనే ఉద్దేశంతోనే సుశాంత్‌ కుటుంబం ఆరోపణలు చేస్తుందన్న వార్తలపై వారి లాయర్‌ వికాస్‌ సింగ్‌ కొట్టిపారేశారు. సుశాంత్‌ పేరిట ఇన్యూరెన్స్‌ లేదని తెలిపారు. 

మరిన్ని వార్తలు