రియాకు షాక్ : ‘విజయానికి తొలి అడుగు’

19 Aug, 2020 12:00 IST|Sakshi

సుశాంత్ సింగ్ మృతి కేసు సీబీఐకి అప్పగించిన సుప్రీంకోర్టు

విజయానికి తొలి అడుగు, అభినందనలు : సుశాంత్  సోదరి

సాక్షి,న్యూఢిల్లీ : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రధానంగా సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ దీనిపై సంతోషం వ్యక్తం చేశారు. విజయానికి, నిష్పాక్షిక దర్యాప్తునకు తొలి అడుగు పడిందంటూ ఆమె ట్వీట్ చేశారు. ప్రార్థనలకు ఫలితం లభించిందంటూ ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమే. సత్యం వైపు మొదటి అడుగు అంటూ ఆమె సీబీఐపై పూర్తి విశ్వాసం ప్రకటించారు. సుశాంత్ స్నేహితురాలు అంకిత లోఖండేతోపాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్,  సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు కూడా దీనిపై స్పందిస్తూ నిజాలు నిగ్గు తేలతాయంటూ ట్వీట్ చేయడం విశేషం. (సుశాంత్‌ మృతి కేసు సీబీఐకి అప్పగించిన సుప్రీంకోర్టు)

కంగనా ఏమన్నారంటే..
సుశాంత్ మరణం తరువాత బాలీవుడ్ నెపోటిజంపై గళమెత్తిన హీరోయిన్ కంగన రనౌత్ కూడా స్పందించారు. ‘మానవత్వం గెలుస్తుంది, ఎస్ఎస్ఆర్ వారియర్స్ కు అభినందనలు, తొలిసారి సామూహిక శక్తి బలం అనుభవంలోకి వచ్చింది. అద్భుతం’ అంటూ ట్వీట్ చేశారు. 

సుశాత్ మృతి కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ హృషికేశ్ రాయ్ సింగిల్ జడ్జి బెంచ్ ఈ తీర్పును వెల్లడించింది. సుశాంత్ తండ్రి ఫిర్యాదు  పట్నా నుంచి ముంబైకి దర్యాప్తును బదిలీ చేయాలన్న రియా చక్రవర్తి పిటిషన్ ను తోసిపుచ్చింది. అంతేకాదు సుశాంత్ మరణానికి సంబంధించి మరేదైనా కేసు నమోదైతే దానిని కూడా సీబీఐ మాత్రమే విచారిస్తుందని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా, రియాతో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులపై సీబీఐ కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణల కింద రియాను మరో దర్యాప్తు సంస్థ ఈడీ కూడా విచారించిన సంగతి తెలిసిందే. 

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) జూన్ 14న ముంబై అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆత్మహత్యగా ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తన కుమారుడి ఆత్మహత్యకు రియా చక్రవర్తి కారణమని రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు ఆధారంగా, పట్నా పోలీసులు జూలై 25న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిని సవాల్ చేస్తూ రియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ అనంతరం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీం ఆదేశించింది. 

మరిన్ని వార్తలు