Dhostan Movie Review: దోస్తాన్‌ మూవీ ఎలా ఉందంటే?

6 Jan, 2023 16:46 IST|Sakshi

టైటిల్‌: దోస్తాన్‌
దర్శక, నిర్మాత : సూర్యనారాయణ అక్కమ్మగారు
బ్యానర్ : శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ 
మ్యూజిక్ : ఏలెందర్ మహావీర్
డీఓపి : వెంకటేష్ కర్రి, రవి కుమార్ 
ఎడిటర్ : ప్రదీప్ చంద్ర
ఫైట్ మాస్టర్ : విక్కీ, అజయ్ 
అసిస్టెంట్ డైరెక్టర్ : కౌసిక్ కాయల

సిద్ స్వరూప్, కార్తికేయ, ఇందు ప్రియ, ప్రియ వల్లబి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దోస్తాన్‌. సూర్య నారాయణ అక్కమ్మగారు దర్శకత్వం చేస్తూనే నిర్మాణ బాధ్యతలను చూసుకున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన పాటలకు, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని  జనవరి 6న రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి.

కథ
వైజాగ్ సిటీలో భాయ్ (చంద్రసే గౌడ) అనే వ్యక్తి డ్రగ్స్, విమెన్ ట్రాఫికింగ్ వంటి అక్రమ బిజినెస్‌లు చేస్తూ చలామణి అవుతుంటాడు. అతను గతంలో చెట్టు కింద పాలిస్తున్న ఓ నిస్సహాయరాలైన తల్లిని సామూహిక అత్యాచారం చేసి చంపేస్తాడు. అక్కడే ఉన్న మరో అనాధ జై (కార్తికేయ)కు ఆ చంటి బిడ్డ ఏడుపు వినిపించి చూడగా అక్కడ ఆ పిల్లాడి తల్లి చనిపోయి ఉంటుంది.. తనలాగే అనాధగా ఉన్న పిల్లాడిని చేరదీస్తాడు. ఏడుస్తున్న పిల్లాడి పాలకోసం వీధిలో ఆడుక్కంటున్న జైను చూసి మెకానిక్ షెడ్ ఓనర్ అయిన బాబా (రమణ మహర్షి ) చేరదీసి షెడ్లో మెకానిక్ పని నేర్చుకోమని చెపుతాడు. అలాగే పెద్దోడికి జై( కార్తికేయ ), చిన్నోడికి రామ్ (సిద్ స్వరూప్) అని నామకారణం చేస్తాడు. వీరు పెద్దయిన తరువాత ఆ పెద్దాయన చనిపోవడంతో జైను చదువుకోమని చెప్పి రామ్ మెకానిక్‌గా మారతాడు. ఈ క్రమంలో జైకు నిత్య (ప్రియ వల్లబి) పరిచయం అవగా, రామ్ (సిద్ స్వరూప్)కు రియా (ఇందు ప్రియ) పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఇలా వీరి లైఫ్ హ్యాపీగా సాగిపోతున్న వీరి జీవితంలోకి మళ్ళీ భాయ్ ప్రవేశిస్తాడు. ఆ భాయ్ వల్ల జై, రామ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చివరికి భాయ్‌పై వీరిద్దరూ ఎలా ప్రతీకారం తీర్చుకొన్నారు? అనేది తెలుసుకోవాలంటే "దోస్తాన్" చూడాల్సిందే!

నటీ నటుల పనితీరు
జై, రామ్ పాత్రలలో నటించిన కార్తికేయ, సిద్ స్వరూప్‌లు కొత్త వారైనా బాగా నటించారు. నిత్య, రియా పాత్రలలో నటించిన ఇందు ప్రియ, ప్రియ వల్లబి ఇద్దరూ గ్లామర్స్ లుక్స్‌తో ఆకట్టుకున్నారు. బాయ్ పాత్రలో నటించిన చంద్రసే గౌడ నెగటివ్‌ షేడ్‌ పాత్రలో జీవించాడు. మిగతావారందరూ తమ పాత్రల పరిధి మేర నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు 
డ్రగ్స్, విమెన్ ట్రాఫికింగ్ అంశాలను సెలెక్ట్ చేసుకొని లవ్, ఎమోషన్స్ జోడించి ప్రేక్షకులకు ఎక్కడా బోర్‌ కొట్టకుండా సినిమా తెరకెక్కించారు దర్శకుడు సూర్యనారాయణ అక్కమ్మ. అన్నతమ్ముళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని చక్కగా చూపించాడు. తుని, లంబసింగి, తలకోన, వరంగల్, హైదరాబాద్, వైజాగ్, కాకినాడ పోర్ట్ తదితర ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ  చేసిన  వెంకటేష్ కర్రి, రవికుమార్ కెమెరామెన్‌ పర్వాలేదనిపించింది. ఏలెందర్ మహావీర్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. ప్రదీప్ చంద్ర ఇంకాస్త షార్ప్‌గా ఎడిట్‌ చేసుంటే బాగుండేది.

చదవండి: కొడుకుతో వంట చేయిస్తున్న అల్లు స్నేహ

మరిన్ని వార్తలు