Sidharth Shukla: వైరల్‌ అవుతున్న సిద్ధార్థ్‌ శుక్లా పాత ఇంటర్వ్యూ

3 Sep, 2021 17:21 IST|Sakshi

Sidharth Shukla Interview Viral: సిద్ధార్థ్‌ శుక్లా (40) సెప్టెంబర్‌ 2న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. హ్యూమన్స్ ఆఫ్ బాంబే గత సంవత్సరం మార్చిలో మహిళా దినోత్సవం సందర్భంగా ఆయనతో నిర్వహించిన పాత ఇంటర్వూని సిద్ధార్థ్‌ జ్ఞాపకార్థం రీపోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో తన తల్లి రీటా గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. సిద్ధార్థ్ మరణం తర్వాత ఈ ఇంటర్వ్యూ తాజాగా వైరల్ అయింది.

అమ్మ నా బెస్ట్‌ ఫ్రెండ్‌
ఆ ఇంటర్యూలో సిద్ధార్థ్‌ మాట్లాడుతూ.. "నేను బయటికి రఫ్‌గా కనిపిస్తాను కానీ మా అమ్మ వరకూ వచ్చేసారికి చాలా సులువుగా కరిగిపోతాను. ఎందుకంటే నా చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. అప్పటి వరకూ ఎండకి, వానకి గొడుగులా కాపాడిన ఆయన లేకపోవడంతో ఎటు పాలుపోని పరిస్థితి. అటువంటి స్థితిలో అమ్మ మా ముందు గోడల నిలబడింది.

నాకు, ఇద్దరు అక్కలకి కష్టం తెలియకుండా పెంచింది. చిన్నప్పుడు నేను ఎప్పుడూ అమ్మని అంటిపెట్టుకొనే ఉండేవాడిని. ఎంతలా అంటే ఆమె చపాతీలు చేస్తున్నప్పుడు ఒక చేతిలో రోలర్‌ ఉంటే, మరో చేతితో నన్ను పట్టుకునేది.అంతేకాకుండా నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆమెతో పంచుకునే వాడిని. ఎవరితో ఎలా ఉండాలి, ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలి అనే ఎన్నో విషయాలు నాకు నేర్పించేది.

అలా నా వయసు పెరుగుతున్న​ కొద్దీ అమ్మ నా బెస్ట్‌ ఫ్రెండ్‌ అయిపోయింది. చిన్నప్పుడు మా ఆర్థిక పరిస్థితుల అంతంత మాత్రంగానే ఉండేవి. అయినా తన కోరికలను చంపుకొని మరి, అమ్మ మా అవసరాలను తీర్చేదని" వెల్లడించాడు. ‘బాలిక వధు’ సీరియల్‌తో పాపులార్‌ అయిన సిద్ధార్థ్ శుక్లాకు తల్లి, ఇద్దరు సోదరీమణులు ఉన్న విషయం తెలిసిందే.

సిద్ధార్థ్ శుక్లా చనిపోయే ముందు రాత్రి, నిద్రపోయే ముందు ఆరోగ్యం బాగోలేదని మెడిసిన్‌ తీసుకొన్నట్లు సమాచారం. కానీ ఉదయం మేల్కోకపోవడంతో సన్నిహితులు కూపర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికి చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

చదవండి: Sidharth Shukla: ఎంత బిజీగా ఉన్నా.. తల్లితోనే.. ఆరోజు సాయంత్రం కూడా

మరిన్ని వార్తలు