సినిమా కోసం 21 కేజీల బరువు తగ్గిన శింబు

20 Sep, 2022 11:10 IST|Sakshi

తమిళ సినిమా: శింబు నటించిన తాజా చిత్రం వెందు తనిందదు కాడు. సిద్ధి ఇద్నాని నాయిక. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరి గణేష్‌ నిర్మించారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ ద్వారా ఈ నెల 15 తేదీ విడుదలైన విషయం తెలిసిందే. టాక్‌తో సంబంధం లేకుండా చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోందని ట్రేడ్‌ వర్గాల సమాచారం. దీంతో చిత్ర యూనిట్‌ ఆదివారం సాయంత్రం చెన్నైలో విజయోత్సవ సమావేశం నిర్వహించింది.

నిర్మాత ఐసరి గణేష్‌ మాట్లాడుతూ.. వెందు తనిందదు కాడు చిత్రం హిట్టు కాదు బంపర్‌ హిట్‌ అని పేర్కొన్నారు. చిత్రం రూ. 50 కోటక్లకు పైగా వసూలు సాధిస్తుందని రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ నిర్వాహకులు చెప్పారన్నారు. చిత్ర కథను దర్శకుడు గౌతమ్‌ తనకు చెప్పినప్పుడు చాలా కొత్తగా ఉందని.. వెంటనే చేద్దామని చెప్పానన్నారు. ఇందులో కథానాయకుడి పాత్రను శింబు మినహా వేరెవరు చేయలేరన్నారు. ఈ చిత్రం కోసం శింబు 21 కిలోల బరువు తగ్గారంటే ఆయన ఎంతగా శ్రమించారో అర్థం చేసుకోవాలన్నారు. ఇందులోని పాత్రకు శింబుకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం ఖాయమన్నారు.

మరో విషయం ఏంటంటే ఈ చిత్రానికి సీక్వెల్‌ కచ్చితంగా ఉంటుందని.. అందుకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని నిర్మాత తెలిపారు. దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ మాట్లాడుతూ.. విన్నైతాండి వరువాయా చిత్రానికంటే ఈ చిత్రానికి  ఎక్కువ విమర్శలు వచ్చాయని తెలిపారు. అలాంటి వాటి నుంచి చాలా నేర్చుకున్నానని, విమర్శలు చిత్రంపై ప్రభావం చూపుతాయన్న విషయాన్ని గమనించాలన్నారు. చిత్ర బాధ్యతలను నిర్మాత పూర్తిగా తన భుజాలపై వేశారని, సింగిల్‌ లైన్‌ కథ చెప్పగానే సూపర్‌ స్టార్‌ కథనా, ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం చేద్దాం అని శింబు అన్నారని తెలిపారు.

నటుడు శింబు మాట్లాడుతూ.. ఇది ఎక్స్‌పెరిమెంటల్‌ కథ కావడంతో వర్కౌట్‌ అవుతుందా అని నిర్మాత ఐసరి గణేష్‌తో అడిగానన్నారు. కథ ఆసక్తిగా ఉండడంతో ఓకే అన్నానన్నారు. చిత్రం బాగా వచ్చిందని, ఇప్పుడు చిత్రానికి మంచి స్పందన రావడంతో సంతోషంగా ఉందన్నారు. విన్నైతాండి వరువాయా తరువాత కొన్ని చిత్రాలు హిట్‌ అయినా, ఈ చిత్రానికి యాక్టింగ్‌ పరంగా వస్తున్న రెస్పాన్స్‌ బాగుందన్నారు. మరిన్ని మంచి చిత్రాలు చేయడానికి ఉత్సాహాన్నిస్తోందన్నారు. దీనికి పార్ట్‌ 2 ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారని, జనరంజక అంశాలతో ఫ్యాన్స్‌ చప్పట్లు కొట్టేలా ఉంటే బాగుంటుందని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు