Simbu-Sudha Kongara: కేజీఎఫ్‌ చిత్ర బ్యానర్‌లో శింబు

9 Oct, 2022 07:41 IST|Sakshi
శింబు, దర్శకురాలు సుధ కొంగర

కేజీఎఫ్‌ చాప్టర్‌–1, చాప్టర్‌–2 చిత్రాలు కన్నడ సినీ చరిత్రను మార్చేశాయని చెప్పవచ్చు. అప్పటి వరకు లో బడ్జెట్‌ చిత్రాలను నిర్మిస్తూ వచ్చిన కన్నడ నిర్మాతలు కేజీఎఫ్‌ చిత్రం తరువాత పాన్‌ ఇండియాస్థాయిలో చిత్రాలను రూపొందించడం మొదలుపెట్టారు. ఆ రెండు చిత్రాల విజయాల ప్రభావం కన్నడ చిత్ర పరిశ్రమపై విశేష ప్రభావం చూపింది. ఈ రెండు చిత్రాల నిర్మాణ సంస్థ హూంబాలే ఫిలిమ్స్‌ అన్నది తెలిసిందే.

కాగా ఈ సంస్థ ప్రస్తుతం ప్రభాస్‌ కథానాయకుడిగా సలార్‌ అనే పాన్‌ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా తమిళంలో మరో భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. దీనికి సూరరైపోట్రు చిత్రంతో జాతీయ ఉత్తమ దర్శకురాలి అవార్డు అందుకున్న సుధాకొంగర దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన అధికార పూర్వక ప్రకటనను నిర్మాణ సంస్థ ఇటీవలే మీడియాకు విడుదల చేసింది. సుధా కొంగర దర్శకత్వంలో చిత్రం చేయనుండడం సంతోషంగా ఉందని అందులో ప్రకటించారు. కాగా తాజాగా ఈ చిత్రంలో సంచలన నటుడు శింబు కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

ఇటీవల విడుదలైన వెందు తనిందదు కాడు చిత్ర సక్సెస్‌ ఎంజాయ్‌ చేస్తున్న శింబు ప్రస్తుతం పత్తు తల చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత ఆయన సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతారని సమాచారం. అదే విధంగా దర్శకురాలు సుధా కొంగర ప్రస్తుతం సూరరై పోట్రు చిత్ర హిందీ రీమేక్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తరువాత శింబు కథానాయకుడిగా నటించే భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతారని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.  

మరిన్ని వార్తలు