నాగ్‌ అశ్విన్‌ మూవీకి మెంటార్‌గా సింగీతం

21 Sep, 2020 13:27 IST|Sakshi

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకోనె నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర వార్త తెలిసింది. విభిన్న చిత్రాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి మెంటార్‌గా వ్యవహరించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు వైజయంతి మూవీస్‌ ట్వీట్‌ చేసింది. సింగీతం శ్రీనివాసరావు స్కెచ్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేసింది. దాంతో పాటు ‘లెజండరీ చిత్రాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయనను మా ఇతిహాసానికి స్వాగతిస్తునందుకు మేం ఎంతో సంతోషిస్తున్నాం. ఆయన సృజనాత్మక రచనలు మాకు మంచి మార్గదర్శకంగా ఉంటాయని ఖచ్చితంగా చెప్పగలం. క్వారంటైన్‌ సమయాన్ని కూడా మా సినిమా కోసం వినియోగించినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేసింది.(చదవండి: కాంబినేషన్‌ రిపీట్‌?)

గత వారం తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని సోషల్‌ మీడియా వేదికగా సింగీత శ్రీనివాసరావు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఇక ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ సినిమాకు వస్తే.. ఈ చిత్ర షూటింగ్‌ 2021లో ప్రారంభమయ్యి.. 2022లో విడుదల కానుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడిస్తామన్నారు. 

మరిన్ని వార్తలు