దేశాన్ని ఊపేసిన సింగర్‌ బయోపిక్.. డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఎంట్రీ

27 Feb, 2024 11:08 IST|Sakshi

భారతీయ సంగీత చరిత్రలో అమర్‌ సింగ్‌ చమ్కీలా  జీవితానికి సంబంధించి ప్రత్యేకమైన చాప్టర్‌ ఉంది. 'చమ్కీలా' పేరుతో ఆయన జీవిత చరిత్ర మీద ఒక సినిమా తెరకెక్కింది. ఇప్పుడా సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఏఆర్‌ రెహమాన్‌ ఈ మూవీకి సంగీతం అందించారు. పంజాబ్, లూథియానా సమీపంలోని దుగ్రీ గ్రామంలో చమార్‌ (దళిత్‌) వర్గానికి చెందిన కుటుంబంలో 1960 జూలై 21న చమ్కీలా జన్మించాడు. అతని అసలు పేరు ధనీరామ్‌ కాగా సంగీత ప్రపంచంలోకి వచ్చిన తర్వాత అమర్‌ సింగ్‌ చమ్కీలాగా పేరు మార్చుకున్నాడు.

దేశాన్ని ఊపేసిన సింగర్‌.. ఆ పాటల వల్లే చంపేశారా..?
చిన్నప్పుడు ఆర్థిక  కష్టాలను ఎదుర్కోని దుస్తుల మిల్లులో పనిచేసిన ఆయన ఓ స్నేహితుడి వల్ల భారతదేశాన్నే ఊపేసే సింగర్‌గా చరిత్రకెక్కాడు. ఆ రోజుల్లో చమ్కీలా పాటకు ప్రభుత్వాలే కూలిపోయేలా ఉండేవి. వివాహేతర సంబంధాలు, మత సంఘర్షణలు, మద్యపానం, వరకట్నాలు, మాదకద్రవ్యాలు.. ఇలా ప్రతి సమస్యపైనా పాట కట్టి.. ప్రజలను ఆలోచింపచేసేవాడు చమ్కీలా. వేడుక ఏదైనా.. ప్రతి ఊళ్లో అతని దరువు వినిపించాల్సిందే. ఏడాదికి ఊరూరా 366 ప్రత్యక్ష ప్రదర్శనలు చేసేవారంటే చమ్కీలా దంపతులు ఎంత బిజీగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు.


(సతీమణి అమర్‌జోత్‌తో అమర్‌ సింగ్‌ చమ్కీలా)

1988 మార్చి 8న మధ్యాహ్నం 2 గంటలకు మెహసంపూర్‌ సమీపంలోని ప్రదర్శనకు వెళ్తుంటే.. ముసుగులేసుకున్న కొందరు దుండగులు బైక్స్‌ మీదొచ్చి చమ్కీలా కారుకు అడ్డుపడ్డారు. మరుక్షణమే తుపాకులతో ఆయన గొంతులోకి తూటాల వర్షం కురిపించారు. ఆ దాడిలో చమ్కీలా(27), సతీమణి అమర్‌జోత్‌ అక్కడికక్కడే కన్నుమూశారు. ఆ సమయంలో అమర్‌జోత్‌ గర్భవతిగా ఉన్నారు. నిజానికి ఈ హత్యకేసుపై చాలా ఊహాగానాలున్నాయి. అప్పటి ఖలిస్తాన్‌ ఉద్యమానికి వ్యతిరేకంగా పాటలు రాసినందుకే సిక్కు ఉగ్రవాదులు చమ్కీలాను చంపేశారని కొందరి అభిప్రాయం.

నెట్‌ఫ్లిక్స్‌లో అమర్‌ సింగ్‌ 'చమ్కీలా' సినిమా
దిల్జిత్ దోసాంజ్, పరిణీతి చోప్రా జోడీగా 'చమ్కిలా' చిత్రం తెరకెక్కింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. ముఖ్యంగా పంజాబ్‌ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న చమ్కిలా సినిమా విడుదల చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు మేకర్స్‌ తెలిపారు. సినిమా అప్‌డేట్‌పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అభిమానులు సినిమాను థియేటర్లలో విడుదల చేయమని కోరారు.

ఈ చిత్రం 1980లలో అత్యంత పేదరికం నుంచి విపరీతమైన పాపులారిటీకి చమ్కిలా ఎలా చేరుకున్నాడు..? కేవలం 27 ఏళ్ల వయసులో  హత్యకు గురికావడం గురించి కథ చెబుతుంది. ఆయన పాటలు పంజాబ్‌లో ఇప్పటికీ ప్రత్యక్ష వేదికలపై వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పటికీ జనం మర్చిపోలేని చమ్కిలాకు సంబంధించిన పాటలు ఇందులో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌ వల్ల భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రేక్షకులను ఆ పాటలు చేరుకుంటాయని చిత్ర దర్శకుడు ఇంతియాజ్ అలీ పేర్కొన్నాడు. పలు ప్రాంతీయ భాషల్లో కూడా చమ్కిలా చిత్రాన్ని తీసుకొస్తామని ఆయన చెప్పారు.

whatsapp channel

మరిన్ని వార్తలు