గాయని కుటుంబంలో తీవ్ర విషాదం

12 Sep, 2020 16:56 IST|Sakshi

ముంబై: ప్రముఖ గాయని అనురాధా పౌడ్వాల్‌ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె కుమారుడు, మ్యూజిక్‌ కంపోజర్‌ ఆదిత్య పౌడ్వాల్‌(35) కన్నుమూశారు. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రముఖ గాయకుడు శంకర్‌ మహదేవన్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.  ‘‘ఈ వార్త వినగానే విషాదంలో మునిగిపోయాను. మా సన్నిహితుడైన ఆదిత్య పౌడ్వాల్‌ ఇకలేరు. తనొక అద్భుతమైన మ్యుజీషియన్‌. మంచి వ్యక్తి. హాస్య చతురత గలవాడు. మేమిద్దరం కలిసి ఎన్నో ప్రాజెక్టులు చేశాం. ఈ విషాదాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. లవ్‌ యూ ఆదిత్య.. నిన్ను మిస్సవుతున్నా’’ అని ఆదిత్య ఫొటో షేర్‌ చేసి సంతాపం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా ఆదిత్య అనారోగ్య కారణాలతో సతమతమవుతున్నాడని, కిడ్నీలు, ఊపిరి తిత్తుల్లో సమస్య తలెత్తడంతో నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించారు. 

ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఆదిత్య మరణించినట్లు శంకర్‌ మహదేవన్‌ ఓ జాతీయ మీడియాకు తెలిపారు. కాగా ఆదిత్య పౌడ్వాల్‌ మృతి పట్ల సినీ, సంగీత ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. గాయకుడు, సంగీత దర్శకుడు తౌసీఫ్‌ అక్తర్‌, సింగర్‌ అర్మాన్‌ మాలిక్‌ ట్విటర్‌ వేదికగా అతడికి నివాళులు అర్పించారు. మంచి మనసున్న ఆదిత్య ఇంత చిన్న వయస్సులోనే లోకాన్ని వీడి వెళ్లడం బాధాకరమన్నారు. ఆదిత్యతో తమకున్న అనుబంధం గురించి గుర్తుచేసుకుంటూ.. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా ఆదిత్య తల్లిదండ్రులు అనురాధ- అరుణ్‌ పౌడ్వాల్‌ ఇద్దరూ సంగీత ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. సంగీత రంగానికి అందించిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం అనురాధను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇక తల్లిదండ్రుల బాటలోనే నడిచిన ఆదిత్య సైతం సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందాడు. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించిన ఠాక్రే సినిమాకు అతడు చివరిసారిగా సంగీతం అందించాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు